చిరంజీవి కుటుంబం ఓ హీరోల ఫ్యాక్టరీ. అక్కడి నుంచి.. ఎప్పుడూ కొత్త హీరోలు వస్తూనే ఉంటారు. దాదాపుగా అందరూ నిరూపించుకున్నవాళ్లే. ఇటీవలే వైష్ణవ్ తేజ్ కూడా వచ్చాడు. తనకీ మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు ఈ కుటుంబం నుంచి మరో హీరో వస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. తనెవరో కాదు. మెగా అల్లుడు… చైతన్య జొన్నలగడ్డ. ఇటీవల చైతన్యతో నిహారిక పెళ్లయిన సంగతి తెలిసిందే. చైతన్యకు నటన అంటే ఇష్టం ఉందని, తను కూడా హీరో అయిపోతాడని వార్తలు వినిపించాయి. పైగా.. చిరు తన అల్లుడు కల్యాణ్ దేవ్ని హీరోగా చేశాడు. అలా… నాగబాబు అల్లుడు కూడా హీరో అయిపోతాడని టాక్ వినిపించింది.
అయితే ఇప్పుడు ఈ విషయంపై నిహారిక క్లారిటీ ఇచ్చేసింది. ”ఆయనకు సినిమాలంటే చాలా ఇష్టం. కొత్త సినిమాలన్నీ చూస్తారు. కానీ.. నటనపై ఎలాంటి ఆసక్తి లేదు..” అని తేల్చేసింది. పైగా.. నటన అన్నది ఓ ప్యాషన్ అని, చిన్నప్పటి నుంచీ దానిపై ఆసక్తి ఉండాలని, ఇప్పటికిప్పుడు అది రాదని…. అందుకే చైతన్య సినిమాల్లోకి రాడని చెప్పింది. ”హీరో అంటే మాటలు కాదు. చాలా కష్టపడాలి. తన నేపథ్యం వేరు. సినిమాలు చూస్తుంటారంతే. నటించరు. ఆ ఉద్దేశం మాకెవరికీ లేదు” అని తేల్చేసింది నిహారిక. సో.. మెగా ఇంటి నుంచి మరో హీరో వస్తున్నాడన్నది రూమరే.