మూడు రాజధానులు, మండలి రద్దు ప్రధాన అజెండాగా ప్రధానమంత్రితో జగన్మోహన్ రెడ్డి భేటీ జరిగింది. ప్రధాని మోడీ అన్నీ తీరిగ్గా విన్నారు. జగన్తో ఆప్యాయంగా మాట్లాడారు. కానీ.. ప్రత్యేకహోదా సహా జగన్ ఇచ్చిన పదకొండు వినతి పత్రాల్లో దేనిపైనా… తనదైన ప్రత్యేక అభిప్రాయం చెప్పలేదు. చివరిగా హోంమంత్రి అమిత్ షాను కలవాలని సూచించినట్లుగా తెలుస్తోంది. దీంతో శుక్రవారం అమిత్ షాను కలిసేందుకు జగన్ మరోసారి ఢిల్లీ వెళ్లబోతున్నారు. మోడీ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా.. అందులో అమిత్ షా ముద్ర ఉంటుందన్న ప్రచారం ఢిల్లీలో ఉంది. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి… తన అజెండాకు కేంద్రం ఆమోదం కావాలంటే.. కచ్చితంగా అమిత్ షాను ప్రసన్నం చేసుకోవాల్సిందే.
ఆంధ్రప్రదేశ్లో వైసీపీ సర్కార్ ఏర్పడినప్పటి నుండి తాము తీసుకుంటున్న ప్రతీ నిర్ణయాన్ని కేంద్రానికి చెబుతున్నామని.. వైసీపీ ముఖ్యనేత విజయసాయిరెడ్డి బహిరంగంగా చెబుతున్నారు. మిగతా వాటి సంగతేమో కానీ.. ఇటీవలి కాలంలో… అత్యంత వివాదాస్పదమైన కొన్ని నిర్ణయాలను ఏపీ సర్కార్ తీసుకుంది. వాటిలో ఒకటి మూడు రాజధానుల నిర్ణయం. రెండోది శాసనమండలి రద్దు. వీటి గురించి కూడా ముందే కేంద్రానికి చెప్పామని.. వారి గ్రీన్ సిగ్నల్ వచ్చాకే అడుగులు ముందుకు వేస్తున్నామని.. అంతర్గతంగా వైసీపీ ముఖ్యులు చెబుతున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమ నిర్ణయాల గురించి… ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షాలకును ప్రత్యక్షంగా కలిసి చెప్పాలనుకుంటున్నారని.. వారి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నరన్న ప్రచారం జరిగింది. ఇప్పుడు ప్రధానికి ఓ మాట జగన్ చెప్పారు.. ఇక అమిత్ షాకు చెప్పాల్సి ఉంది.
మోడీ… గో ఎహెడ్ అని.. భుజం తడితే రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్లాలని జగన్ అనుకున్నారు. కానీ మోడీ.. అమిత్ షాతో మాట్లాడాలని సూచించారు. అమిత్ షా స్పందన ఎలా ఉంటుందో.. ఇప్పటికి వైసీపీ వర్గాలకు క్లారిటీ లేదు. చాలా రోజులుగా జగన్మోహన్ రెడ్డి అమిత్ షా అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రయోజనం ఉండటం లేదు. గురువారమే.. అపాయింట్మెంట్ దొరుకుతుందని.. ఢిల్లీలో ఉండాలని మొదట జగన్ భావించారు. కానీ అమిత్ షా గురువారం అందుబాటులో ఉండటం లేదని తేలడం.. శుక్రవారం అపాయింట్ మెంట్ ఖరరావుతుందని స్పష్టత రావడంతో… విజయవాడ వెళ్లి రావడం మంచిదని నిర్ణయించుకున్నట్లుగాచెబుతున్నారు. ఈ శుక్రవారం అమిత్ షాతో భేటీ తర్వాత జగన్కు.. తన నిర్ణయాలపై కేంద్రం స్పందన ఏమిటో ఓ అవగాహనకు వచ్చే అవకాశం ఉంది.