వైసీపీ సర్కార్ తీసుకున్న నిర్ణయాలపై ఇప్పుడు జీవోలొస్తున్నాయి. గెజిట్లు కూడా ప్రకటిస్తున్నారు. ఇంత జరిగిన తర్వాతే ప్రభుత్వానికి ఉద్యోగుల్లో కోవర్టులున్నారని క్లారిటీ వచ్చింది. బిజినెస్ రూల్స్ ఉల్లంఘించి మరీ.. వారు జీవోలు, గెజిట్లు ఇస్తున్నారని స్పష్టత వచ్చింది. అదీకూడా సీఎంవో విచారణకు ఆదేశిచిన తర్వాతనే.
ఇటీవల ఉద్యోగుల జీపీఎస్‌కు సంబంధించిన జీవోను గెజిట్ రూపంలో ప్రకటించారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం రోజున సైలెంట్ గా జీవో జారీ చేసేశారు. అది జారీ అయిందో లేదో తెలియదు.. నెల రోజుల తర్వాత అంతే సైలెంట్ గా గెజిట్ ప్రకటన వచ్చేసింది. ఎవరు అనుమతి ఇచ్చారు అని ఆరా తీస్తే ఎవరూ అనుమతి ఇవ్వలేదు. గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తాజాగా ఉద్యోగులే సొంత నిర్ణయాలు తీసుకున్నారు. చేయమన్న పని చేయరు కానీ.. ఈ పని చేయడం ఏమిటని అంతా ఆశ్చర్యపోయారు.
గత ప్రభుత్వం చివరి ఆరు నెలల కాలంలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి ఏమైనా కొత్తగా ఆదేశాలు జారీ చేయాలంటే.. కొత్త ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సిందేనని బిజినెస్ రూల్స్ చెబుున్నాయి. కానీ కొంత మంది అధికారులు.. తమ సానుభూతి పార్టీ పెద్దల ఆశీస్సుల మేరకు.. సైలెంట్ గా కోవర్టు ఆపరేషన్లు చేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారు. సస్పెండ్ అయిన సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామిరెడ్డి కనుసన్నల్లో ఈ వ్యవహారాలు జరుగుతున్నాయని సీఎంవో గుర్తించి బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు రెడీ అయింది.