సినిమా చూపిస్త మావ, నేను లోకల్, హలో గురు ప్రేమ కోసమే సినిమాలతో వరుస హిట్లు కొట్టాడు త్రినాథరావు నక్కిన. ఈ విజయాల్లో రచయిత ప్రసన్నకుమార్ పాత్ర చాలా కీలకం. ఈ మూడు చిత్రాలకు కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందించింది ప్రసన్న కుమారే. ఈ విజయాలతో ప్రసన్న పారితోషికం కూడా బాగా పెరిగింది. ఈ జంటే.. వెంకటేష్‌కి ఓ కథ చెప్పి ఓకే చేయించుకుంది. అయితే… ఇప్పుడు ఈ టీమ్ నుంచి ప్రసన్నకుమార్ బయటకు వచ్చేశాడు. క్రియేటీవ్ డిఫరెన్సెన్స్ వల్లే త్రినాథరావు – ప్రసన్నకుమార్ విడిపోయారని సమాచారం. అయితే.. పారితోషికం కూడా ఓ ప్రధాన కారణం అని తెలుస్తోంది. హలో గురు ప్రేమ కోసమే సినిమాకి ప్రసన్నకుమార్ కోటి రూపాయల పారితోషికం అందుకున్నాడు. వెంకీ సినిమాకి దర్శకుడికీ – రచయితకీ కలిపి 5 కోట్లు డిమాండ్ చేశారు. అయితే అందులో సగం వాటా నాకు రావాలని ప్రసన్న పట్టుబట్టినట్టు సమాచారం. రచయితకీ, దర్శకుడికీ సమాన పారితోషికం ఏమిటన్నది త్రినాథరావు వాదన. అలా.. ఇద్దరి మధ్యా క్లాష్ వచ్చింది. దాంతో త్రినాథరావుతో ప్యాచప్ చెప్పేసి – దర్శకుడిగా కొత్త ప్రయత్నాలు ప్రారంభించాడట ప్రసన్న. మరోవైపు వెంకీ తో ప్రాజెక్టు కూడా ఆగిపోయిందని తెలుస్తోంది. ప్రసన్న స్థానంలో కొత్త రైటర్ని పట్టుకోవడానికి త్రినాథరావు ప్రయత్నిస్తున్నాడట. మరి.. ప్రసన్న ఉన్నప్పటి పంచ్.. త్రినాథరావుకి దొరుకుతుందో లేదో??