వైఎస్ వివేకానందరెడ్డి సౌమ్యుడు. ఎవర్నీ ఒక్క మాట కూడా అనరు. ఇది అందరికీ తెలిసిన విషయం. ఆయనలోని కోపాన్ని చూసిన వారు తక్కువ. అలాంటిది.. కొద్ది రోజుల కిందట… ఆయన పులివెందులలో ఓ ధర్నా చేశారు. ఓ ఇంటి చుట్టూ.. కార్లు, ద్విచక్రవాహనాలు అడ్డం పెట్టి.. ఇంట్లో వాళ్లు బయటకు రాకుండా దిగ్బంధించి నిరసన చేపట్టారు. ఆ ఇల్లు ఎవరిదో కాదు.. తన సోదరుడు వైఎస్ ప్రతాప్ రెడ్డిదే. మైనింగ్‌కు సంబంధించిన లావాదేవీల విషయంలో సమస్య ఉన్నట్లు అప్పట్లో పేర్కొన్నారు. వైఎస్ ప్రతాప్ రెడ్డి ఇంటి చుట్టూ 3 గంటల పాటు ద్విచక్రవాహనాలు, కార్లను పెట్టారు. ఈ ఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై పోలీసులు కూపీ లాగుతున్నారు.
వైఎస్ వివేకానంద రెడ్డి అనుచరుడు రవీంద్రనాథ్ రెడ్డి.. కొన్ని సంవత్సరాలుగా వివేకా సోదరుడు ప్రతాప్ రెడ్డి బంధువు రాజశేఖర్ రెడ్డితో వ్యాపారం చేస్తున్నారు. రవీంద్రనాథ్ రెడ్డి.. పేరుపై వ్యాపారం చేస్తున్నప్పటికీ.. వివేకానందరెడ్డిదే.. అసలు వ్యాపారమని చెబుతారు. వీరిద్దరూ చిత్తూరు జిల్లా కుప్పం వద్ద గ్రానైట్ క్వారీని లీజుకు తీసుకున్నారు. ఈ క్వారీ దాదాపు రూ.600కోట్ల విలువ చేస్తుందని అంచనా ఉంది. 2008లో మొదలైన ఈ క్వారీ.. 2012 వరకు రాజశేఖర్ రెడ్డి ఆధీనంలోనే సాగింది. అప్పటికే రవీంద్రనాథ్ రెడ్డి దాదాపు రూ.50లక్షలు రాజశేఖర్ రెడ్డికి ఇచ్చారు. అయితే.. ఇంత వరకు వ్యాపారంలో వచ్చిన లాభాలు కానీ.. డబ్బులు కానీ ఇవ్వలేని రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపిస్తున్నాడు. తనకు న్యాయం చేయాలంటూ వివేకానంద రెడ్డిని ఆశ్రయించాడు.
దీంతో వివేకానందరెడ్డి.. లెక్కలు చెప్పాలంటూ.. తన సోదరుడు ప్రతాప్ రెడ్డి ఇంటి ఎదుట వివేకానందరెడ్డి ఆందోళన చేపట్టారు. మూడు గంటల తర్వాత వైఎస్ కుటుంబ పరువు బజారున పడుతుందని నచ్చ చెప్పి… వివేకానందరెడ్డిని పంపిచేశారు. వైఎస్ మరణం తర్వాత పలు అంశాల్లో వైఎస్ కుటుంబంలోనే పదేపదే వివాదాలు తలెత్తుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి అందర్నీ ఏక తాటిపై ఉంచలేకపోతున్నారని చెబుతున్నారు. ఆ పరిణామాలే… ప్రస్తుత పరిస్థితులకు కారణం అంటున్నారు.