తెలంగాణ బీజేపీలో పంచాయితీ ముదురుతున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి – ఎమ్మెల్యేల మధ్య రోజురోజుకు గ్యాప్ మరింత పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది. పార్టీలో సరైన గౌరవం లభించడం లేదని అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలు .. తాజాగా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పదాధికారుల సమావేశానికి ఏడుగురు డుమ్మా కొట్టడం చర్చనీయాంశం అవుతోంది.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమయంలో రాష్ట్ర నాయకత్వం వ్యవహరించిన తీరు పట్ల ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల గవర్నర్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యేలు హాజరైనా ఎవరిని గవర్నర్ కు కిషన్ రెడ్డి పరిచయం చేయకపోవడం పట్ల వారంతా మనస్తాపానికి గురైనట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పార్టీ ఎమ్మెల్యేలకు కిషన్ రెడ్డి ఎందుకు ప్రాధాన్యత ఇచ్చేందుకు సంకోచిస్తున్నారు..? అనేది పెద్ద ప్రశ్నగా మారింది.
Also Read : హరీష్ కూడా స్పందించాల్సిందేనా.. లేదంటే..
కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిని కొద్ది రోజుల్లోనే తప్పించి మరో నేతకు పార్టీ పగ్గాలు అప్పగించనున్నారు. అయినప్పటికీ ఎమ్మెల్యేలతో సఖ్యతగా మెదిలేందుకు అనాసక్తి చూపడం పట్ల సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఎమ్మెల్యేల్లో కొంతమంది బండి సంజయ్ , ఈటల వర్గంగా ముద్ర పడటంతోనే వారిని కిషన్ రెడ్డి దూరం పెడుతున్నారన్న టాక్ నడుస్తోంది.
గత కొద్ది రోజులుగా కొనసాగుతోన్న ఈ అంతర్గతపోరుకు ఎప్పుడు ముగింపు లభిస్తుంది అని పార్టీ శ్రేణులు మధనపడుతుండగా.. కొత్త అధ్యక్షుడి ప్రకటనతోనే ఈ లొల్లికి ముగుస్తుందనే అభిప్రాయం వినిపిస్తోంది.