ఏడోక్లాస్ విద్యార్థి ఒకడు…రోజూ టివీల్లో వస్తున్న ఇంద్రాణి వార్తాకథనాలు చాలా శ్రద్ధగా చూశాడు. న్యూస్ పేపర్లలో కాలాలకొద్ది ప్రింటైన ఇంద్రాణి కేసు వివరాలు అంతే శ్రద్ధగా చదివాడు. చివరకు ఏమైంది ?
తన తల్లిలో ఇంద్రాణిని చూసుకున్నాడు.
అమ్మకు తాను అక్రమసంతానమన్నాడు.
తన తల్లి ఇంద్రాణిలా తిరుగుబోతన్నాడు.
ఇలా తన నోట్ పుస్తకంలో రాసేసుకున్నాడు.
టీచర్లు చూసి విస్తుపోయారు.
ఎందుకు ఇలా జరిగింది ? టీనేజ్ పిల్లలు చెడిపోవడానికి కారణాలేమిటి?
పూర్తి వివరాలు..
న్యూస్ పేపర్ తిరగేస్తే చాలు ఇంద్రాణి కేసు వార్తలే. టివీ ఆన్ చేస్తేచాలు ఇంద్రాణి ప్రేమ వ్యవహారాలు, నేరాలకు సంబంధిచిన వార్తాకథనాలే. మీడియా అతిగా స్పందించడంవల్ల జరిగే అనర్థం ఎలాఉంటుందో ఇదిగో ఈ పిల్లాడి `అక్రమ’రాతలనుబట్టే తెలుసుకోవచ్చు.
ఢిల్లోలోని ఒక ప్రైవేట్ స్కూల్లో ఏడవ తరగతి చదువుతున్న పిల్లాడు తన నోట్ బుక్ లో రాసిన రాతలు చూసి టీచర్లు అవాక్కయ్యారు. స్కూల్ నోట్ పుస్తకంలో ఇంతకీ ఈ పిల్లాడు ఏంరాశాడు ?
`నేను మా అమ్మకు అక్రమసంతానాన్ని.
మా అమ్మ, ఇంద్రాణిలాంటిది.
ఆమె ఎంతోమందితో తిరుగుతోంది ‘
ఇది చూసి టీచర్లు కంగారుపడ్డారు. వెంటనే ఈ విషయం ప్రిన్సిపాల్ దగ్గరకు తీసుకెళ్లారు. తల్లిదండ్రులను పిలవడం, పిల్లాడ్ని మందలించి సస్పెన్డ్ చేయడం చకచకా జరిగిపోయాయి. ఇప్పుడాకుర్రాడు కౌన్సిలింగ్ లో ఉన్నాడు.
న్యూస్ చూడొద్దని చెప్పగలమా ?
చాలా చిత్రమైన పరిస్థితి ఇది. ప్రతి స్కూల్ లో అసెంబ్లీ జరిగేటప్పుడు ఆరోజు వార్తలు పిల్లలకు వినిపించడం చాలాకాలంనుంచి వస్తున్నదే. వార్తలందు జగతి వర్థిల్లుతుండన్నది నానుడి. వార్తాపత్రికలు చదవడంవల్ల పిల్లల్లో మానసిక వికాసంకలుగుతుందన్నదనే ఇప్పటివరకు అనుకుంటున్నాం. కానీ నిజానికి అలా జరగడంలేదు. వికాసం సంగతి దేవుడెరుగు. అందుకుభిన్నంగా మానసిక దౌర్భల్యం చోటుచేసుకుంటున్నది. వార్తల్లోని వ్యక్తులే తమకు ఆదర్శమన్న భావన కూడా పెరుగుతోంది. వారిని అనుకరించాలన్న కోరికపుడుతోంది. ఈ పిల్లాడి సంగతి తీసుకుంటే, రోజూ ఇంద్రాణి వార్తలు చదవడం, చూడటంవల్ల అతని మైండంతా ఇంద్రాణి ఆక్రమించింది. దీంతో తననుతాను సెన్సెషనలైజ్ చేసుకోవడం కోసం తన తల్లిపైనే నిందారోపణలు చేశాడని కౌన్సిలింగ్ లో తేలింది.
వార్తలను హైలైట్ చేయడంకోసం సెన్షేషనలైజ్ చేయడం, ప్రతిచిన్న విషయాన్ని గంటలతరబడి టివీల్లో చూపించడం, ఈమధ్యకాలంలో సర్వసాధారణమైపోయింది. ఏది ఎక్కువసార్లు చూపించాలో, మరేది తక్కువసార్లు చూపించాలన్న కనీసపు ఇంగితజ్ఞానం మీడియాకు కొరవడటం అత్యంత శోచనీయం. మహిళల వ్యక్తిగత జీవితాల గురించి న్యూస్ పేపర్లలో పేజీలకు పేజీలు, టివీల్లో గంటల తరబడి కవరేజ్ చేయడం ఎలాంటి అనర్ధాలు సృష్టిస్తాయో ఈ ఏడవతరగతి పిల్లాడి సంఘటన చాటిచెబుతోంది. మీడియా హద్దులుదాటి ప్రవర్తిస్తుందనడానికి అంతకంటే బలమైన సాక్ష్యం ఏమి కావాలని బాలలహక్కుల యాక్టివిస్ట్ , న్యాయవాది అయిన అశోక్ అగర్వాల్ ప్రశ్నిస్తున్నారు.
ఇలాంటివి ఎన్నో…
ఈ స్కూల్ పిల్లాడి రాతలు బట్టబయలు అయ్యాయికాబట్టి చెప్పుకుంటున్నాం. కానీ బయటపడని పిల్లల వికృతచేష్టల సంఘటనలు చాలానే జరుగుతున్నాయి. చూసే సినిమాలు, వింటున్న కథలు, చదివే వార్తలు, టివీలో వస్తున్న వార్తాకథనాలు, తోటి పిల్లలు చెప్పే మాటలు, తల్లిదండ్రుల ప్రవర్తన వంటివి పిల్లల్ని వికృతచేష్టలవైపు మళ్ళిస్తున్నాయి. ట్వెల్త్ క్లాస్ చదువుతున్న మగపిల్లలు ఆడపిల్లలతో ఏకాంతంగా గడపాలని కోరుకుంటున్నారనీ, స్కూల్ గదుల్లోనే జంటగా కనబడుతున్నారని స్కూల్ యాజమాన్యాలే అంగీకరిస్తున్న నిజం. టీనేజ్ లో ఏదో చూడాలని, ఏదో చూడాలన్న తపన ఒకవైపుకాగా, మరోవైపున టివీలు, సినిమాల కలిగించే చెడుప్రభావం పిల్లలను దారిమళ్ళిస్తున్నాయి. ఇలాంటి చేష్టలను ఎలా కంట్రోల్ చేయాలో తెలియక చాలాస్కూల్స్ చేతులెత్తేస్తున్నాయి. ఎవరైనా నిలదీసి అడిగితే `ఇదంతా మాములే..’ అన్నట్టు మాట్లాడుతున్నారు. పైగా ఈప్రవర్తనను పసిగట్టి కంట్రోల్ చేయాల్సిన స్థలం ఇల్లేకాని బడికాదన్నది వీరివాదన.
14ఏళ్లకే తొలి అనుభవం
పిల్లల్లో సెక్స్ ఆసక్తిపై సర్వేజరిపినప్పుడు ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. పిల్లల్లో తొలి సెక్స్ అనుభవంపై ఆరాతీస్తే, ఎక్కవశాతంమంది 14ఏటనే తొలి అనుభవం రుచిచూశారని తేలింది. సెక్స్ ఆనందం సంగతి పక్కనబెడితే, అంతకంటే ముంచుకొస్తున్న పెనుముప్పుఏమంటే, సెక్సువల్ డిసీజెస్ కమ్ముకోవడం. లైంగికపరమైన వ్యాధులు పెరగడానికి ఇదో ప్రధానకారణమని అంటున్నారు. 14నుంచి 16ఏళ్ల లోపు విచ్చలవిడి సెక్స్ కారణంగా చివరకు ఎయిడ్స్ వంటి ప్రాణాంతక వ్యాధులు కూడా టీనేజ్ లోనే వచ్చేస్తున్నాయని సర్వేలు చెబుతున్నాయి. అయినప్పటికీ టీనేజ్ వాళ్లకు ఏదిమంచో, ఏది చెడో తెలియజెప్పే సెక్స్ ఎడ్యూకేషన్ పై సరైన శ్రద్ధపెట్టడంలేదు. పిల్లలు సరైనమార్గంలోనే ఉన్నారనే విషయాన్ని విశ్వసనీయ వ్యక్తుల ద్వారా సమాచారాన్ని ఇటు తల్లిదండ్రులు, అటు టీచర్లు ఎప్పటికప్పుడు సేకరిస్తుండాలి. అంతేకాదు, ఈ విషయంలో మీడియా తన కీలకపాత్రను విస్మరించకూడదు. అత్యుత్సాహంతో మీడియా ప్రవర్తిస్తే పైన చెప్పినట్టు ఏడేళ్ల పిల్లలు కూడా ఇలాగే వింతగా ప్రవర్తిస్తారు.
– కణ్వస