హైదరాబాద్: గత ఆదివారం తునిలో రత్నాచల్ ఎక్స్ప్రెస్ను, పోలీస్ స్టేషన్ను, 25 ప్రభుత్వ, ప్రైవేట్ వాహనాలను తగలబెట్టిన ఘటనలకు సంబంధించి స్పష్టమైన ఆధారాలు బయటకొస్తున్నాయి. ఆ రోజు జరుగుతున్న విధ్వంసాన్ని పోలీసులు చిత్రీకరించిన వీడియోల ద్వారా, కొందరు ప్రయాణీకులు, ప్రజలు చిత్రీకరించిన మొబైల్ వీడియోల ద్వారా ఈ ఆధారాలు లభిస్తున్నాయి. ప్రజలు చిత్రీకరించిన వీడియోలు సోషల్ మీడియా ద్వారా బయటకొచ్చాయి. ఈ వీడియోలన్నింటినీ పరిశీలించగా కొందరు ముఖాలు కనపడకుండా కర్చీఫ్లు కట్టుకుని దాడలు చేయటం కనబడింది. వీరంతా కొన్ని వాహనాలలో వచ్చి దాడులకు పాల్పడ్డట్లుగా కూడా పోలీసులు వీడియోలద్వారా గమనించారు. ఈ వాహనాల నంబర్లను, వాటిద్వారా యజమానులను పట్టుకోవటానికి ప్రస్తుతం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సభకు హాజరయ్యి, సెల్ ఫోన్ల ద్వారా తుని విధ్వంసాన్ని చిత్రీకరించిన వారు వాటిని తమకు అందించాలని పోలీసులు కాపు సామాజికవర్గానికి విజ్ఞప్తి చేశారు. కర్చీఫ్ గ్యాంగ్ దుండగులను పట్టుకునేందుకు ఏపీ పోలీసులతోపాటు రైల్వే పోలీసులు సంయుక్తంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ కేసును సీఐడీకి అప్పగించాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. తుని విధ్వంసంలో మొత్తం రు.130 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు పోలీసులు పేర్కొన్న సంగతి తెలిసిందే.