వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ శివార్లలో రైతులు చేస్తున్న ఆందోళన పరిధి అంతర్జాతీయం అయిపోయింది. వారి పోరాట పటిమ కావొచ్చు… మరొకటి కావొచ్చు.. అంతర్జాతీయంగా స్పందనలు వస్తున్నాయి. వాటిపై కేంద్ర ప్రభుత్వం అతిగా స్పందించడంతో అత్యధిక ప్రాధాన్యం లభిస్తోంది. ఇండియాలో మానవ హక్కులు ఉల్లంఘనకు గురువుతున్నాయన్న చర్చ ప్రారంభమయింది. చివరికి దిశా రవి అనే 21 ఏళ్ల పర్యావరణ ఉద్యమకార్యకర్తను టూల్ కిట్ పేరుతో అరెస్ట్ చేయడం.. సంచలనం రేపుతోంది. ఆమె అరెస్ట్‌కు వ్యతిరేకంగా కొంత మంది .. అరెస్ట్ సహజమేనని మరికొంత మంది నేరుగా రాష్ట్రపతికి లేఖలు రాయడం..అందులో మాజీ ప్రధాన న్యాయమూర్తులు ఉండటం మరింత చర్చనీయాంశం అవుతోంది. అసలు దిశా రవి ఏం చేశారు..? ఎందుకీ పరిస్థితి వచ్చిందన్నది ఇప్పుడు కీలకం అయింది.
ఉద్యమం ఎలా చేయాలో ప్లాన్ చేసుకోవడమే టూల్ కిట్..!
బాల పర్యావరణ ఉద్యమకారిణిగా .. గ్రెటా ధన్ బర్గ్ ప్రపంచం మొత్తానికి ట్రంప్ తెంపరితనం వల్ల పరిచయం అయ్యారు. ఆమె భారత రైతుల ఆందోళనలకు మద్దతుగా ట్వీట్ చేశారు. ఆ క్రమంలో ఓ టూల్ కిట్‌ను జత చేశారు. ఆ టూల్కిట్లో ఎప్పుడెప్పుడు ఎలా ఉద్యమం చేయాలో కార్యాచరణ ఉంది. టూల్ కిట్ అంటే చాలా మంది ఏదేదో అనుకుంటున్నారు. అది ఓ కార్యాచరణ పత్రం మాత్రమే. సోషల్ మీడియా వ్యూహంతోపాటు, నిరసన ప్రదర్శనల సమాచారం కూడా ఉంది. ఉద్యమం ఉద్ధృతం చేయడానికి ఉపయోగించుకుంటారు. రాజకీయ పార్టీలు, కార్పొరేట్ వర్గాలు అన్నీ ఈ టూల్ కిట్ తరహా ప్లాన్‌ను అమలు చేసుకుంటాయి. నిజానికి ఇది ఒకరు తయారు చేసేది కాదు… ఎవరైనా ఎక్కడినుంచైనా గూగల్ డాక్యుమెంట్ ఎడిట్ చెయ్యొచ్చు. అందరి ఆలోచనలను అందులో పొందుపరిచి.. అన్నీ ఒకేచోట ఉండేలా చేయొచ్చు. ఇప్పుడీ టూల్ కిట్‌ను దిశా రవి రూపొందించారనేది పోలీసుల అభియోగం.
గ్రెటా ప్రారంభించిన సంస్థలో కార్యకర్త కావడమే దిశా తప్పు..!
దిశా రవి మధ్యతరగతి కుటుంబానికి చెందిన పర్యావరణ ఉద్యమకారిణి. ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ అనే సంస్థ కోసం పని చేస్తూంటారు. ప్రభుత్వాల చైతన్యం కోసం శుక్రవారాన్ని కేటాయించండి అని ఆ సంస్థ పిలుపునిస్తుంది. ప్రభుత్వ వర్గాల్లో పర్యావరణ చైతన్యాన్ని తీసుకొచ్చేందుకు ప్రతి శుక్రవారం విద్యార్థులు నిరసన తెలిపే లక్ష్యంతో గ్రెట్ దీన్ని ప్రారంభించారు. ఇండియా చాప్టర్లో దిశా రవి లాంటి 150 మంది పని చేస్తున్నారు. గోవా, జమ్మూ, మధ్య ప్రదేశ్లలో చెట్లు కొట్టేస్తున్నప్పుడు ప్రచారోద్యమం చేశారు. అయితే వీరిపై ఇప్పుడు దేశద్రోహ అభియోగాలు నమోదయ్యాయి.
అసలు టూల్ కిట్‌లో తప్పేంటో ఎవరైనా చెప్పగలుగుతున్నారా..?
దిశతో పాటు నికితా జాకబ్, శాంతాను ములుక్ లపై కేసులు నమోదయ్యాయి. మిగిలిన వారికి ముందస్తు బెయిల్ వచ్చింది. దిశ రవిని మూడు రోజుల కస్టడీకి ఇచ్చారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం. దిశ ఫోను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఆమెవ్యక్తిగత సమాచారం.. చాట్స్ మొత్తాన్ని మీడియాకు లీక్ చేశారు. కొన్ని విలువలు విడిచేసిన ఇంగ్లిష్ మీడియా చానెళ్లు.. మొత్తం వాటిని ప్రసారం చేసేస్తున్నాయి. ఇప్పుడు ఆమెకు అనుకూలంగా.. వ్యతిరేకంగా దేశంలో రెండువర్గాలు వాదనలు వినిపిస్తున్నాయి. ఆమె దేశానికి ఏ విధంగా చెడు చేయబోయిందో విశ్లేషిస్తున్నారు కొంత మంది… కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకున్నారు అంటున్నారు మరికొంత మంది.
దిశారవి అరెస్ట్ వ్యవహారంలో నిజానిజాలు పూర్తిగా ఎవరికీ తెలియదు. ఎందుకంటే ప్రభుత్వాలు తెలియనివ్వవు. తమ వాదనను బలపరిచేలా సోషల్ మీడియా ప్రచారాల్ని కప్పి పుచ్చుతాయి. దాని వల్ల.. దేశానికెంత లాభమో.. వారికే తెలియాలి. ఒక్కటి మాత్రం నిజం… దిశా రవి …ఘటన దేశానికి మేలు చేయదు.