రన్ రాజా రన్ సినిమాలో ట్విస్టులే కీలకం. ఆ ట్విస్టులే సినిమాని నిలబెట్టాయి కూడా. రెండో సినిమాకీ సుజిత్ ట్విస్టులనే నమ్ముకున్నాడు. తన రెండో సినిమా `సాహో`అన్న సంగతి తెలిసిందే. దాదాపు 250 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన సినిమా ఇది. చూడ్డానికి యాక్షన్ డ్రామాలా కనిపిస్తున్నా.. సినిమాలో ట్విస్టులే ట్విస్టులని తేలింది. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ థ్రిల్ కలిగిస్తుందని తెలుస్తోంది. పోకిరి, రంగస్థలం మొన్నొచ్చిన `ఎవరు`.. ఇవన్నీ క్లైమాక్స్‌లో ఇచ్చిన ట్విస్టులకు ప్రేక్షకులు షాక్‌కి గురయ్యారు. అప్పటి వరకూ నడిచిన కథ ఒక ఎత్తయితే… ఆ ట్విస్టు మరో ఎత్తు. సినిమా స్వరూపాన్ని మార్చేసే ట్విస్టు ఆ క్లైమాక్స్‌లకు ఉంది. సాహోలోనూ అలాంటి ట్విస్టే ఇవ్వబోతున్నారు ప్రభాస్, సుజిత్. ఇంట్రవెల్ బ్యాంగ్, క్లైమాక్స్ ట్విస్టు.. ఇవి రెండూ నచ్చే ప్రభాస్ ఈ కథకు ఓకే చెప్పాడట. వాటి మధ్య రోమాంచిత యాక్షన్ ఘట్టాల్ని అల్లుకుంటూ వెళ్లారు. సాహో ట్రైలర్లో ఛేజింగుల హడావుడి ఎక్కువగా కనిపిస్తోంది. రోడ్డుపై ట్రక్కులు, కార్లు, స్పోర్ట్స్ బైకులపై తెరకెక్కించిన యాక్షన్ షాట్లు ఎక్కువగా ట్రైలర్లో చూపించారు. అయితే.. ఎడారి నేపథ్యంలో తెరకెక్కించిన 15 నిమిషాల యాక్షన్ సీక్వెన్స్ వీటన్నింటికంటే పెద్ద హైలెట్ అవుతుందని భావిస్తున్నారు. యాక్షన్ సన్నివేశాలన్నీ కలిపితే దాదాపుగా 55 నిమిషాల వరకూ వచ్చిందని సమాచారం. అంటే.. దాదాపుగా సగం సినిమా ఫైటింగులే. ఆ యాక్షన్ ఘట్టాలు, ట్విస్టుల్ని బట్టే సాహో రేంజ్ ఆధారపడి ఉంటుంది.