” ఒకడికి నువ్ ఎంత అయినా సాయంచేయి… వాడి కుటుంబానికి ఆకలి తీర్చు.. వాడికి ప్రాణం పోసి ఉండవచ్చు.. కానీ ఎదైనా సందర్భంలో ఒక్క సారి పది రూపాయలు అడిగితే ఇవ్వకపోతే శత్రువు అయిపోతావు. ఇంత కాలం చేసిన మేలు గుర్తు ఉండదు. అందుకే మంచి చేసే ముందు గుణాగుణాలు కూడా చూసుకో ” అని ఇటీవల సోషల్ మీడియాలో వస్తున్న కొటేషన్లు చూస్తూంటే.. ఎవరికైనా అందులో నిజముంది కదా అనిపిస్తుంది. కొద్ది రోజులుగా రామోజీ రావు, మార్గదర్శి, ఈనాడు విషయంలో కొంత మంది సోషల్ మీడియా నిపుణులు చేస్తున్న వ్యాఖ్యలు చదివిన తర్వాత… అసలు వారి బ్యాక్ గ్రౌండ్ ఏమిటో పరిశీలించిన తర్వాత… రామోజీరావుకు అలా జరగాల్సిందేనని ఎవరికైనా అనిపిస్తుంది. ఎందుకంటే.,.. ఆయన పెంచి పోషించి.. వారి కుటుంబాల్ని బతికేలా చేసిన రామోజీరావు మీద బండలేస్తున్నారు.
రామోజీ బతికించిన కుటుంబాలు లక్షల్లో !
రామోజీరావు మహా వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఆయన సక్సెస్ అయిన వ్యాపారాలే కళ్ల ముందు ఉన్నాయి. ఆయనకూ ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఎన్నో కంపెనీల్ని మూసేశారు. న్యూస్ టైమ్ అనే ఇంగ్లిష్ పత్రిక పెట్టి నడపలేక మూసేశారు. ఇలాంటి వైఫల్యాలు చాలా ఉన్నాయి. కానీ ఏ ఒక్క ఉద్యోగికీ ఆయన అన్యయం చేయలేదు. జీతాలు తక్కువ అనే ఓ ప్రచారం చేస్తారు. తక్కువ అనేదాన్ని ఎలా నిర్దారిస్తారో ఎవరికీ తెలియదు. మైక్రోసాఫ్ట్ లో పని చేసే వాళ్లకూ.. తమ ప్రతిభకు తగ్గ జీతం రావడం లేదనే అసంతృప్తి ఉంటుంది. రామోజీ లాంటి వారి మీద ఏడవడానికి ఇది ఇంకా ఎక్కువ అవకాశం ఉంటుంది.
తెలుగు జర్నలిజంలో ఉన్న సగం మందికిపై జర్నలిస్టులు ఈనాడు కాంపౌండ్ నుంచి వచ్చిన వారే
ఇప్పుడు ఏపీ జర్నలిజం రంగంలో సగం మందికిపైగా .. . ఇంకా చెప్పాలంటే… మీడియా సంస్థల్లో కమాండింగ్ పొజిషన్ లో ఉన్న వారు అందరూ ఈనాడులో అక్షరాలు దిద్దుకున్నవారే. వారేమీ పుట్టుకతో లబ్దప్రతిష్టులు కాదు. వారిని ఎంపిక చేసుకుని… సొంత డబ్బులు ఖర్చు పెట్టి.. జీతాలు ఇచ్చి మరీ సానబట్టారు. వారికి స్కిల్ ఇచ్చారు. అలాంటి వారంతా ఇప్పుడు తమను ఏదో రామోజీ దోచేశాడని అనుకుంటూ ఉంటారు. బయట విమర్శలు చేస్తూ ఉంటారు. నిజానికి అలాంటి భావం ఉంటే… ముందుగానే వదిలి వెళ్లిపోవాల్సింది. కానీ … రామోజీ లేకపోతే… తమ కుటుంబానికి తిండి కూడా ఉండేది కాదన్న సంగతిని మర్చిపోతారు. ఇలాంటి వారే ఇప్పుడు సోషల్ మీడియాలో బండలు వేస్తారు.
ఈనాడులో ప్రమోషన్లు రాలేదని బయట సోషల్ మీడియాలో విషం చిమ్మే మాజీ ఈనాడీయన్స్
ఒకప్పుడు ఈనాడులో పుట్టి పెరిగిన వారు… ఇప్పుడు రామోజీపై విషం చిమ్ముతూ ఉంటారు. వారిలో చాలా మంది ఈనాడు లేకపోతే తమ బతుకు బుగ్గిపాలేనని అంగీకరించరు. తాము గొప్ప ప్రతిభావంతులం అని తమకు అవకాశాలు ఇవ్వలేదని. ఫీలవుతూ ఉంటారు. బయట వీరు చూపే వికృతం చూసిన తర్వాత ఈనాడు యాజమాన్యం తప్పు చేసిందని ఎవరైనా అనుకుంటారా ?. ఉన్నంత కాలం బాగా బతికి .. పిల్లల్ని చదివించుకుని వారు వృద్ధిలోకి వచ్చాక..కాలు మీద కాలేసుకుని ఇంత కాలం తమ ఉన్నతికి కారణమైన వారిపైనే నోరు పారేసుకోవడం వారి ప్రవృత్తి. ఇలాంటి వారిని చూసిన తర్వాతే సమాజంలో కృతజ్ఞత అనే పదానికి అర్థం లేదని ఎవరికైనా తెలిసిపోతుంది.