హైదరాబాద్: కృష్ణా, గుంటూరు జిల్లాలలో – ముఖ్యంగా విజయవాడ పరిసర ప్రాంతాలలో – మూతబడిన, ఇవాళో రేపో మూతబడేటట్లున్న ఇంజనీరింగ్ కళాశాలలకు దశ తిరిగింది. ఇలాంటి కళాశాలలను గుర్తించి వాటిలో ప్రభుత్వ కార్యాలయాలను, సిబ్బంది క్వార్టర్స్‌ను తాత్కాలికంగా ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపును పర్యవేక్షిస్తున్న జవహర్ రెడ్డి కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. అలాంటి ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలతో సంప్రదింపులు జరపాలని కమిటీ రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖకు ఆదేశాలు జారీచేసింది. కొన్నేళ్ళక్రితం పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ప్రస్తుతం విజయవంతంగా నడవని సంగతి తెలిసిందే. దీనితో కొన్ని కాలేజీలను మూసేయగా, మరికొన్నింటిని ఉన్న కొద్దిమంది విద్యార్థులతోనే నడిపిస్తున్నారు. ఈ కాలేజీలను లీజుకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.
మరోవైపు విజయవాడ, గుంటూరు నగరాల శివార్లలో ఖాళీగా ఉన్న గోడౌన్లను కూడా జవహర్ రెడ్డి కమిటీ పరిశీలిస్తోంది. వాణిజ్యకేంద్రాలైన విజయవాడ, గుంటూరు నగరాల శివార్లలో పత్తి, మిర్చి, పొగాకు పంటలను భద్రపరచటానికి అనేక ప్రైవేట్ గోడౌన్లను గతంలోనే నిర్మించారు. వాటిలో చాలా గోడౌన్లు ఖాళీగా ఉన్నాయి. ఆ గౌడౌన్లకింద చాలా స్థలం ఉన్నందున లీజు గురించి వాటి యజమానులతో కూడా మాట్లాడాలని కమిటీ వేర్‌హౌసింగ్ డిపార్ట్మెంట్ను ఆదేశించింది.
ఇక సెక్రెటేరియట్ విషయానికొస్తే, 3,000 మంది ప్రభుత్వోద్యోగులకు సరిపోయే భవనాన్ని ఎంపిక చేయటం ప్రభుత్వానికి తీవ్ర సమస్యగా మారింది. గన్నవరంలోని మేధా టవర్స్‌ను తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ, ప్రభుత్వోద్యోగులు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది విజయవాడ నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉండటం, ఆ పరిసర ప్రాంతాలలో వసతికి ఇళ్ళు, పిల్లలకు మంచి స్కూల్స్ వంటి మౌలిక సౌకర్యాలు లేకపోవటాన్ని ఉద్యోగులు ఎత్తి చూపిస్తున్నారు. అదీకాక ముఖ్యమంత్రి కార్యాలయాన్ని మంగళగిరిలో ఏర్పాటు చేస్తున్నందున అక్కడకు, గన్నవరానికి మధ్య ఉద్యోగులు తిరగటం చాలా కష్టమవుతుందంటున్నారు. అయితే ప్రభుత్వంమాత్రం ఆ విమర్శలను పట్టించుకోకుండా ముందుకెళుతోంది. మేధా టవర్స్‌ను సెజ్ హోదానుంచి డీ నోటిఫై చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఆ డీ నోటిఫికేషన్ జరగకుండా సెక్రెటేరియట్‌ను మేధా టవర్స్‌లోకి తరలించటం వీలుకాదు. కేంద్రం నిర్ణయంపైనే సెక్రెటేరియట్ తరలింపు ఆధారపడిఉంది.