హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇవాళ అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత శత్రుత్వం ఉన్న అధికార, ప్రతిపక్ష పార్టీల అధినేతలు చంద్రబాబునాయుడు, జగన్మోహన్ రెడ్డి చేతులు కలుపుకున్నారు. ఒకరకంగా చంద్రబాబే చొరవ తీసుకుని జగన్కు షేక్ హ్యాండ్ ఇచ్చారని చెప్పాలి. ఇవాళ జగన్ జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ సీటువద్దకు వెళ్ళి మరీ శుభాకాంక్షలు తెలిపారు. కొందరు మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు కూడా జగన్ వద్దకు వెళ్ళి శుభాకాంక్షలు తెలుపుతూ చేయి కలిపారు. ఈ సందర్భంగా స్పీకర్ కోడెల శివప్రసాదరావుకూడా జగన్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు జగన్ జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల వైసీపీ కార్యాలయాలలో పార్టీ కార్యకర్తలు, నాయకులు కేకులు కట్ చేసి వేడుక జరుపుకున్నారు.