ఏపీలో మంత్రులు, ఎమ్మెల్యేల వందరోజుల పనితీరుపై ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇదివరకు ప్రకటించిన సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వం ఏర్పడి మరికొద్ది రోజుల్లోనే వంద రోజులు కానున్న నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై చంద్రబాబు ఇచ్చే ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎలా ఉండనుందనేది సర్వత్రా ఆసక్తి రేపుతోంది.
ఇప్పటివరకు ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు అయితే మంచి మార్కులే పడ్డాయి. హామీ ఇచ్చినట్టుగానే అధికారం చేపట్టిన వెంటనే సామాజిక పెన్షన్లు పెంపు, డీఎస్సీ నిర్వహణతోపాటు ఇటీవల వరదలు విజయవాడను ముంచెత్తిన సమయంలో చంద్రబాబు కష్టపడిన తీరు అందర్నీ మంత్రముగ్ధుల్ని చేసింది. ఏడు పదుల వయస్సులోనూ ఆయన నిర్విరామంగా వరద బాధితుల సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ.. ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలించిన తీరు బాధితులకు బాబు నాయకత్వంపై మరింత భరోసానిచ్చింది.
చంద్రబాబు ఏపీ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా పాలన కొనసాగిస్తుండగా.. ఆయన టీమ్ కూడా అలాగే పని చేస్తుందా? అనే చర్చ జరుగుతోంది. మంత్రులు చంద్రబాబు డైరక్షన్ లో పని చేస్తున్నా.. కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం ఆ దిశగా పని చేయడం లేదని ప్రచారం జరుగుతోంది. ఈమేరకు మంత్రులు , ఎమ్మెల్యేల పనితీరుపై ఇంటలిజెన్స్ వర్గాలతో చంద్రబాబు సర్వేలు చేయించినట్లుగా టాక్ నడుస్తోంది.
ఈ నేపథ్యంలోనే వంద రోజుల ప్రోగ్రెస్ రిపోర్ట్ ముందుంచి..మంత్రులు,ఎమ్మెల్యేలకు చంద్రబాబు మరోసారి దిశానిర్దేశం చేయనున్నారని తెలుస్తోంది. ప్రజలకు చేరువ కానీ నేతలకు ఆయన హితబోధ చేయనున్నారు.ఇక ,చంద్రబాబు చేయిస్తోన్న ఈ సర్వేలో తమ పనితీరు ఎలా ఉందోనని మంత్రులు, ఎమ్మెల్యేలు కొంతమంది హైరానా పడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.