ఏపీలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో జరిగిన అనర్థాలు, భారీ ఆర్థిక లోటుపై సీఎం చంద్రబాబు కొన్ని రోజులుగా శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. అమరావతిని చంపే ప్రయత్నం, మైనింగ్ లో చేతివాటం, విద్యుత్ సంక్షోభంలో అసలు విషయాలతో పాటు పోలవరంపై నిర్లక్ష్యాన్ని ఆయన ఇప్పటికే బయటపెట్టారు.
అయితే, ఏపీ ఆర్థిక పరిస్థితితో పాటు ఎక్సైజ్, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పై అసెంబ్లీలోనే… మాజీ సీఎం జగన్ ముందు శ్వేతపత్రాలు విడుదల చేయాలని నిర్ణయించారు.
మీడియా ద్వారా ప్రజలకు వివరించటం వేరు… త్వరలో అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభం అవుతున్నందున, అసెంబ్లీలోనే జగన్ సర్కార్ చేసిన అరాచకాన్ని ప్రజల ముందుంచాలని నిర్ణయించారు.
రకరకాల బ్రాండ్స్ పేరుతో వచ్చిన చీప్ లిక్కర్, చీప్ లిక్కర్ తాగి జనం అనారోగ్యం బారిన పడటం… మద్యపాన నిషేధం అని చెప్పి జగన్ చేసిన మోసాన్ని ప్రజలకు వివరించబోతున్నారు సీఎం చంద్రబాబు. ఇక ఏపీ ఆర్థికంగా దివాళా తీసేందుకు జగన్ తీసుకున్న నిర్ణయాలు, భవిష్యత్ ను పెట్టిన తాకట్టుపై కూడా సీఎం కూలంకుషంగా ఎమ్మెల్యేల ముందుంచనున్నారు.
ఇక గడిచిన 5 ఏళ్లలో ఏపీని మరో బీహార్ గా చేసిన విధానం… రాష్ట్రంలో ప్రశ్నిస్తే కేసులు, వేధింపులతో ఎలా అరాచకాలు చేశారో కూడా క్షుణ్ణంగా అసెంబ్లీ ద్వారా వివరించబోతున్నారు.
దీని వల్ల ప్రజలకు నిజాలు చెప్పటంతో పాటు మాజీ సీఎం జగన్ ఏం చెప్పబోతున్నారో… కూడా తేలిపోనుంది. ఆయన ఒక తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఏం చెప్తారు? అసెంబ్లీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్ ఎలా తనను తాను సమర్థించుకుంటారో చూడాలి.