బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆయా జిల్లాలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు.
వాయుగుండం ప్రభావంతో ముఖ్యంగా ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించడంతో.. ఆయా జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో చంద్రబాబు సమీక్ష చేపట్టారు. శ్రీకాకుళం, విశాఖ ,విజయనగరం ,ఏలూరు , కాకినాడ , తూర్పుగోదావరి జిల్లాల ఉన్నతాధికారులతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని .. ఈమేరకు వాహనాలు వెళ్ళలేని ప్రాంతాల్లో డ్రోన్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఆయా ప్రాంతాల్లో వరద ప్రవాహాన్ని అంచనా వేసేందుకు డ్రోన్ లను విస్తృతంగా వినియోగించాలన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో అంటూ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని.. వైద్య శిబిరాలను కొనసాగించాలని అధికారులను ఆదేశించారు.
మరోవైపు బుడమేరు వరదప్రవాహం తగ్గడంతో కొంత ఉపశమనం లభించినట్లు అయిందని చంద్రబాబు పేర్కొనగా.. పట్టణంలో కొన్ని నివాసాలకు మినహా విద్యుత్ సేవలను పునరుద్దరించామని చంద్రబాబుకు అధికారులు వివరించారు.