విజయవాడలో ఏపీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధర్మపోరాట దీక్ష చేస్తున్న రోజునే… హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ హంగామా చేశారు! తెల్లారిన దగ్గర నుంచి వరుస హీటెక్కించే ట్వీట్లు పెట్టారు. తనపై టీడీపీ కక్ష కట్టిందనీ, మీడియాలోని ఒక వర్గంతో బద్నామ్ చేసే కార్యక్రమం పెట్టుకుందని విమర్శలకు దిగారు. మొత్తానికి, శుక్రవారం మధ్యాహ్నం అయ్యేసరికి పవన్ హంగామా కాస్త తగ్గింది. అయితే, సాయంత్రం విజయవాడలో తన దీక్షను విరమిస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సుదీర్ఘంగా మాట్లాడారు. నేరుగా ప్రస్థావించకపోయినా పవన్ హంగామాపై పరోక్షంగా ఆయన వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవాలి.
‘నేను ఏదైనా ఒక మంచి ప్రోగ్రామ్ తలపెడితే, ఈరోజు ఈ పవిత్ర కార్యం ఉంటే.. దీన్ని కూడా డైవర్ట్ చేసే విధంగా వ్యవహరించారు. వాళ్లకేదో ఒక వ్యక్తిగత సమస్య ఉంటే… అది రేపు పెట్టుకోవచ్చు, నిన్న పెట్టుకోవచ్చు, ఎల్లుండి పెట్టుకోవచ్చు. ఈరోజే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటివన్నీ డైవర్ట్ చేయడానికి తప్ప ఇంకోటి కాదని మీకు తెలియజేస్తున్నా’ అని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో 175 స్థలాల్లో దీక్ష చేస్తున్నారనీ, కానీ ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తున్నాయన్నారు. రాజకీయాల్లోకి ఇంతవరకూ రాని వ్యక్తులు కూడా దీన్ని డైల్యూట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని మరోసారి అన్నారు. మీకేదైనా వ్యక్తిగత సమస్యలుంటే ఏవిధంగా పరిష్కరించుకోవాలో, అవి కూడా తాను చెప్తానని చంద్రబాబు చెప్పారు. ఇలా తన ప్రసంగంలో రెండుసార్లు ఈ అంశం మాట్లాడారు.
నేరుగా ప్రస్థావించకపోయినా ఇవి పవన్ కల్యాణ్ ను ఉద్దేశించిన వ్యాఖ్యల్లానే అనిపిస్తున్నాయి కదా! వ్యక్తిగత సమస్యలుంటే నిన్న, ఎల్లుండి, రేపు పెట్టుకోవాలంటే.. నేడు పెట్టిన కార్యక్రమం ఫిల్మ్ ఛాంబర్ దగ్గర హడావుడి అనే కదా! రాజకీయాల్లోకి ఇంకా రాని వ్యక్తులు అని చంద్రబాబు వ్యాఖ్యానించింది కూడా ఎవరి గురించో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ సమస్యలు ఏవిధంగా పరిష్కరించుకోవాలో తాను చెబుతానని కూడా ముఖ్యమంత్రి అనడం గమనార్హం!