డబ్బును బ్యాంకుల నుంచి ఏ విధంగా విత్ డ్రా చెయ్యాలి..? ఎంతెంత విత్ డ్రా చేయాలి..? క్యాష్ లెస్ ట్రాంజాక్షన్లు ఎలా జరుపుకోవాలి..? పింఛెన్లను ఎలా ఖర్చు చేయాలి..? డ్వాక్రా మహిళలు నగదును ఎలా నిర్వహించుకోవాలి..? – ఇలాంటి ఏ విధంగా చేసుకోవాలో ప్రజలకు వివరిస్తున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పెద్ద నోట్ల రద్దు తరువాత ప్రజల పడుతున్న కరెన్సీ కష్టాలను ఎలా తట్టుకోవాలో ఆయన చెబుతున్నారు! ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులు, పింఛెనుదారులకు ఆయన ఓ విజ్ఞప్తి చేశారు.
అందరికీ జీతాలు బ్యాంకుల్లో వేస్తామని చెప్పారు. అయితే, నగదు అంతా ఒకేసారి తీసుకోవద్దనీ దఫదఫాలుగా తీసుకుంటే బాగుంటుందని సూచించారు. వీలైనంత వరకూ డెబిడ్ కార్డుల ద్వారానే ఖర్చులు పెట్టుకోవాలన్నారు! చదువుకున్నవారంతా మొబైల్ బ్యాంకింగ్ సేవల్ని వినియోగించుకోవాలని చెప్పారు. డ్వాక్రా మహిళలకు చెల్లించే మూడు వేల రూపాయలు కూడా బ్యాంకుల్లోనే వేస్తామన్నారు. అంతేకాదు, ఉపాధి హామీ కూలీల చెల్లింపులు కూడా బ్యాంకుల్లోనే వేస్తామన్నారు. ఒకటో తారీఖు వస్తోంది కదా అని ఎవ్వరూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చంద్రబాబు భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం రూ. 1250 కోట్లు అందుబాటులో ఉందని చెప్పారు. త్వరలోనే రూ. 2 వేల కోట్లకుపైగా సొమ్ము వస్తోందని వివరించారు.
అంతా బాగానే ఉందిగానీ… బ్యాంకులకు వెళ్లి కొంచెం కొంచెం విత్ డ్రా చేసుకోండని చెప్పడమే కాస్త విడ్డూరంగా ఉంది! ఎందుకంటే, వాస్తవంలో ఆ కొంచెం కూడా బ్యాంకులు ఇవ్వడం లేదు కదా! వారానికి రూ. 24 వేల విత్ డ్రా చేసుకోవచ్చని చెబుతున్నా బ్యాంకులు ఇవ్వలేకపోతున్నాయి. సెల్ఫ్ చెక్ మీద అమౌంట్ ఎంత రాసుకోవాలో కూడా బ్యాంకువారే చెబుతున్నారు. పోనీ.. ఇచ్చినంత తీసుకుందామని బ్యాంకులకు వెళ్లినా రోజంతా అక్కడే పని! బ్యాంకులు ఇస్తున్నవే ఇంతింత. దాన్ని కూడా దఫదఫాలు విత్ డ్రా చేసుకోండని చెబుతుంటే… వింటున్న సామాన్యుడికి ఎలా ఉంటుంది చెప్పండి!
ఇప్పటికే మూడు వారాలైంది. ఏటీఎమ్లు అందుబాటులోకి రాలేదు. బ్యాంకుల్లో క్యాష్ లేదు. ఏమైనా అంటే.. అందరూ ఈ-బ్యాంకింగ్ నేర్చుకోవాలీ.. క్యాష్ లెస్ లావాదేవీలు చెయ్యాలీ.. అంటూ కొత్తగా శిక్షణా తరగతులు పెట్టేస్తున్నారు. టీ దుకాణంలో టీ తాగడానికీ, రోడ్డ పక్కన కూరలు కొనడానికీ, బండి మీద టిఫిన్ కొనుక్కోవడానికి కూడా డెబిట్ కార్డు పేమెంట్లు చేయమంటే ఎలా..?