బీసీ వర్గాలతో ఏలూరు జిల్లా అగిరిపల్లి మండలం వడ్లమానులో నిర్వహించిన ప్రజా వేదికలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. అగిరిపల్లిలో హామీ ఇచ్చినట్లుగా అర్హులైన వారందరికీ ఇల్లు నిర్మాణం చేశాకే ఓట్లు అడుగుతానన్నారు. పీ-4తో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.. సంపద అనేది ఒకరికే పరిమితం అవ్వకూడదు.. 10 మంది సంపన్నులు 20 మంది పేదలకు చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు.
అగిరిపల్లిలో 206కుటుంబాలను గుర్తించామని, అర్హులందరికీ స్థలం ఇచ్చి ఇల్లు కట్టాకే మళ్లీ ఓట్లు అడుగుతానని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ 206కుటుంబాలను నూజివీడు కంపెనీ అధినేత ప్రభాకర్ కు అప్పగించిన చంద్రబాబు..వారి కోసం ముందుకు వచ్చిన ప్రభాకర్ తోపాటు మరికొంతమందిని అభినందించారు. సంపన్నులు పేదలకు సహాయం చేసేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు.
బీసీ వర్గాలతో మాట్లాడుతూ..టీడీపీకి మొదటి నుంచి వెన్నుముక బీసీలేనని , ప్రధాని మోడీతోపాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కలిసి బీసీల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నట్లు వివరించారు.త్వరలోనే బీసీల సంరక్షణ చట్టం తీసుకొస్తామన్నారు. బీసీలకు కార్పోరేషన్లు పెట్టి అభివృద్దికిలోకి తీసుకొస్తున్నామని చెప్పారు. ఎన్టీఆర్ హయాంలో బీసీ గురుకులాలు వచ్చాయి. ఫారీన్ లో చదువుకునే బీసీ విద్యార్థులకు 15లక్షల సాయం అందిస్తున్నామన్నారు. సివిల్స్ , గ్రూప్ వంటి ఉన్నత ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు అండగా ఉంటామని చెప్పారు.
ఏపీ నుంచి సివిల్స్ ఉద్యోగులు ఎక్కువగా ఉండేలా అమరావతిలో సివిల్స్ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. బ్యాచ్ వారిగా శిక్షణ ఇస్తామని, ప్రతి బ్యాచ్ లో 500mమంది చొప్పున ఉంటారని పేర్కొన్నారు. బీసీలను అభివృద్ధిలోకి తీసుకురావాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నట్లు వివరించారు.
బీసీలతోపాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల అభివృద్ధి కోసం కూడా చర్యలు చేపడుతామని వివరించారు. ఇల్లు కట్టుకునే వర్గాలకు 50 వేలు ఇస్తాం.. ఎస్సీల ఇళ్లకు ఉచితంగా సోలార్ ప్యానెల్స్ మంజూరు చేస్తున్నామని చంద్రబాబు వివరించారు.