ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షత టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం వాడీవేడిగా జరిగింది. కొంతమంది నేతలను ఉద్దేశించి సీఎం ఘాటు వ్యాఖ్యలే చేశారని సమాచారం. వింటే వ్యక్తిగతంగా చెబుతాననీ, విననివారికి ప్రజల సమక్షంలో చెబుతా అంటూ హెచ్చరించినట్టు తెలుస్తోంది. ఈ వ్యాఖ్యలు కొంతమంది ఎమ్మెల్యేలతోపాటు కొన్ని నియోజక వర్గాల ఇన్ ఛార్జ్ లను ఉద్దేశించి చేశారని చెబుతున్నారు. సీఎం ఇంతగా ఆగ్రహించడానికి కారణం.. సుమారు 50 మందికిపైగా నాయకులపై సొంత పార్టీ కార్యకర్తల నుంచీ వినిపిస్తున్న ఫిర్యాదులేనని సమాచారం!
కొంతమంది ఎమ్మెల్యేలు నియోజక వర్గాలకు దూరంగా ఉంటున్నారనీ, కార్యకర్తలకు అందుబాటులో ఉండటం లేదన్న సమగ్ర సమాచారం ముఖ్యమంత్రికి ఉంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలోనూ ఈ ఎమ్మెల్యేలు అలసత్వం వహిస్తున్నారన్న అభిప్రాయమూ సీఎంకి ఉంది. ఇంత తీవ్రంగా క్లాస్ తీసుకోవడానికి ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు కూడా ఓరకంగా కారణమనీ చెప్పొచ్చు. జనసేన, వైకాపాలు ఈ మధ్య ఇసుక అక్రమాలూ, ఇతర సంక్షేమ కార్యక్రమాల్లో అవినీతి అంటూ విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై సమావేశంలో చంద్రబాబు ప్రస్థావిస్తూ… ప్రభుత్వానికి వస్తున్న ఆదాయాన్ని కూడా వదులుకుని ప్రజలకు ఉచితంగా ఇసుక ఇస్తుంటే, ఎందుకిలా ఆరోపణలు వస్తున్నాయనీ, వాటిపై ఎందుకు స్పందించడం లేదని కొంతమంది నాయకులకు చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు.
టీటీడీపై ఆరోపణలు, ఉద్దానం సమస్యపై ప్రభుత్వం ఏమీ చెయ్యలేదు, అవినీతి సొమ్మును చంద్రబాబు విదేశాలకి తరలిస్తున్నారు.. ఇలాంటి కొన్ని ఆరోపణలను ప్రతిపక్షాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇవి కూడా సమావేశంలో ప్రస్థావనకు వచ్చాయని తెలుస్తోంది. ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు ప్రతిపక్షాలు తీవ్ర స్వరంతో చేస్తుంటే, కొంతమంది నేతలు ఉదాసీనంగా ఎందుకు వ్యవహరిస్తున్నారని కూడా చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. ఇలాంటి అంశాలపై బలమైన కౌంటర్లు ఇవ్వాలనీ, మీడియాతోపాటు సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించుకోవాలనీ సూచించారు. గుంటూరు జిల్లాకు చెందిన నేతలు సమావేశానికి గైర్హాజరైతే… కీలక సమావేశాలకు రాని నేతలకు పదవులు అవసరమా అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
గతంలో కూడా నేతలకు చంద్రబాబు క్లాస్ తీసుకున్న సందర్భాలు చాలానే ఉన్నా, తాజాగా ఆయన తీవ్ర ఆగ్రహమే వ్యక్తం చేశారని టీడీపీ వర్గాలే అంటున్నాయి. సీఎం స్పందన చూస్తుంటే.. వచ్చే ఎన్నికల్లో కొంతమంది నాయకులను పక్కనపెట్టే అవకాశం ఉన్నట్టు అనిపిస్తోంది.