పార్టీ ప్రయోజనాలకు భంగం కలిగించేవారిని సహించేది లేదని టిడిపి అధినేత ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి హెచ్చరిక చేశారు. రెండు మూడు నెలలకోసారి ఈ విధమైన హెచ్చరిక చేసినట్టు మీడియాలో వస్తుంటుంది కాని నిజంగా ఆరోపణలకు వివాదాలకు గురైన వారిపై కఠిన చర్యలు తీసుకున్న ఉదంతాలు చాలా తక్కువ. ఎప్పటిదాకానో ఎందుకు ఇదే విడియో కాన్ఫరెన్సులో కోడిపందేలపై ఆయన మాట్లాడింది చూస్తే వద్దన్నట్టూ ఒప్పుకున్నట్టూ వుంది.సంప్రదాయం అనుకుంటే సరే గాని జాదంగా మారకూడదని చెప్పారట. అంటే ఏమిటి? కోడిపందేలు జూడంలా గాక మరెలా జరుగుతాయి? ఒకవైపున పోలీసుల హెచ్చరికలు కేసులు అంటూ వుంటే ముఖ్యమంత్రి మధ్యేమార్గం సూచిస్తున్నారనుకోవాలి. అంటే జరిగే పందేలను జూదంగా గాక క్రీడగా పరిగణించాలన్నమాట. అలా అయినా జంతు హింస చట్టం వర్తిస్తుంది కదా.. టిడిపి నేతలకు ఏవో హెచ్చరికలు చేయడం మందలింపులతో సరిపెట్టడం తప్ప ఇంతవరకూ కఠినమైన చర్యలు తీసుకున్నది దాదాపు లేదు. పార్టీ ప్రయోజనాలంటే వారి ఇష్టం గాని ప్రజా ప్రయోజనాలకు నష్టం చేసిన ప్రజా ప్రతినిధులను ఉపేక్షించడం వల్ల్లనే ఒక సారి దౌర్జన్యం చేసిన వారు మరో రూపంలో చేస్తున్నారు. కాబట్టి హెచ్చరికలతో పాటు వాటి అమలు చేసే లక్షణం కూడా వుండాలి.లేకుంటే సిగరెట్ పెట్టపైన స్టాట్యూటరీ వార్నింగ్లలా మారిపోతాయి.