తెలంగాణ మహానాడులో పాల్గొన్న చంద్రబాబు.. ఆ పార్టీ నేతలకు అంతిమంగా ఏం సందేశం ఇచ్చారో ఎవరికీ అర్థం కావడం లేదు. అధికార పార్టీ టీఆర్ఎస్పై కానీ.. ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌పై కానీ ఆయన ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేయలేదు. కానీ బీజేపీని పూర్తిగా టార్గెట్ చేశారు. తెలంగాణలో భారతీయ జనతాపార్టీని టార్గెట్ చేసి.. సాధించేదేమీ లేదు. అలాగే ఆయన జాతీయ రాజకీయాలు.. కేంద్ర ప్రభుత్వ తీరుపైనా విమర్శలు గుప్పించారు. మోదీ సర్కారు వైఫల్యాల గురించి మాట్లాడారు. కానీ అంతిమంగా తెలంగాణ నేతలకు మాత్రం ఎలాంటి సందేశం ఇవ్వకుండా… సాదాసీదాగా ప్రసంగాన్ని ముగించేశారు. అనేక సందేహాలను అలాగే ఉంచేశారు.
నిజానికి ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ చివరి మహానాడును జరుపుకుంటోంది. గతమెంతో ఘనం లాంటి పరిస్థితిలో ఉన్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ.. తెలంగాణలో ఉనికి కోసం పోరాడుతోంది. నమ్ముకున్న నేతలు ఒక్కొక్కరుగా వెళ్లిపోతున్నా… పునాదులు బలమైనవి కావడంతో ఓటు బ్యాంక్ ఇంకా మిగిలే ఉందన్న నమ్మకం ఆ పార్టీ నేతల్లో ఉంది. కానీ ఇది.. తెలంగాణలో గెలిచే స్థాయిలో లేదు. కనీసం కింగ్ మేకర్ అవుతుందన్న ఆశలు కూడా అడుగంటిపోయాయాయి. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటుందన్న చర్చలు .. ఇటీవలి కాలంలో ఎక్కువగానే జరుగుతున్నాయి. కొంత మంది కాంగ్రెస్ మంచిందంటున్నారు..మరికొంత మంది టీఆర్ఎస్ బెటరంటున్నారు.
ఇలా చర్చించుకుంటున్న వాళ్లందరూ.. టీడీపీతో సంబంధం లేని వాళ్లే. కానీ పధ్నాలుగేళ్లుగా అధికారంలో లేనప్పటికీ.. పార్టీని నమ్ముకున్న తెలంగాణ సీనియర్ నేతలు మాత్రం చంద్రబాబుపైనే భారం వేసి.. బండి లాగుతున్నారు. వీరి ఆశలు కూడా పొత్తులే. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే చాన్స్ లేదనే.. రేవంత్ రెడ్డి పార్టీని వీడిపోయారు. ఆ తర్వాత టీఅరెస్‌తో పొత్తుకు అంతా రెడీ అయిందని ప్రచారం జరిగింది. కానీ క్లారిటీ మిస్సయింది. తాజాగా కేంద్రాన్ని ఢీకొట్టేందుకు చంద్రబాబు చేస్తున్న జాతీయ స్థాయి కూటమి రాజకీయాలు..మరో విశ్లేషణను తెర ముందుకు తెస్తున్నాయి. ఆయన కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే చాన్స్ ఉందంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు మహానాడు ప్రసంగంలో ఓ క్లారిటీ ఇస్తారనుకున్నారు.
కానీ ఈ పొత్తులపై టీడీపీ అధినేతకు ఇప్పటికీ ఓ క్లారిటీ రాలేదన్నట్లుగా ప్రసంగం ఉంది. కాంగ్రెస్ పార్టీనీ ఏమీ విమర్శించలేదు.. టీఆర్ఎస్ విషయంలోనూ సంయమనం పాటించారు. అంటే రెండు పార్టీలకు.. దగ్గరగా..దూరంగాఉన్నట్లు మాట్లాడారు. అలాగని ఒంటరిగా పోటీ చేసే అవకాశం కూడా లేదు. గత ఎన్నికల్లో కలసి పోటీ చేసిన బీజేపీ మాత్రం దూరమే. ముందు ముందు జరగబోయే పరిణామాలు… టీ టీడీపీ వెళ్లే దిశను నిర్ణయించవచ్చు… కొసమెరుపేమిటంటే… మహానాడులో కళాకారులు.. కేసీఆర్ ను ఉద్దేశించి కొంచెం ఘాటు పదాలతోనే పాటలు పాడారు. కానీ… టీ టీడీపీ అధ్యక్షుడు రమణ మాత్రం అభ్యంతరం చెప్పారు. నేరుగా వేదిక మీద నుంచి క్షమాపణ కూడా చెప్పారు..!