ఏ పనిచేయడానికైనా ఓ లక్ష్యముండాలి. లక్ష్యాన్ని నిర్దేశించుకుని చేసే పనులు కచ్చితంగా కొద్దోగొప్పో ఫలితాన్నిస్తాయి. ఈ సూత్రాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మిన నేత నారా చంద్రబాబు నాయుడు. హైదరాబాద్‌ను నేనే అభివృద్ధి చేశానన్న ఆయన మాటను ప్రతిపక్షంతో పాటూ ఆయనంటే పడని వారు ఎగతాళి చేయవచ్చును గాక. అడగందే అమ్మయినా పెట్టదని సామెత. అమ్మా ఆకలేస్తోందంటే.. పిల్లాడు తిని ఎంత సేపైందన్నది ఆలోచించకుండా గోరుముద్దలు తినిపిస్తుంది అమ్మ. వ్యాపార వ్యవహారాలు అలా కావు కదా. ఎవరైనా పారశ్రామికవేత్తల్ని మన దగ్గరకు ఆహ్వానించేటప్పుడు మనమే వారి వద్ద\కు వెళ్ళాలి. మన గురించి వివరించాలి. ఉన్న మౌలిక సదుపాయాలపై అవగాహన కల్పించాలి. వారిని మెప్పించాలి. మన దగ్గరకు వచ్చేలా ఒప్పించాలి. ఇదే ఇప్పుడు చంద్రబాబు చేస్తున్న పని.
అమెరికా వెళ్ళి పదిరోజులుండాలంటే డబ్బు ఖర్చవుతుంది. రాష్ట్రం పనిమీద వెడుతున్నారు కాబట్టి, ప్రజాధనాన్నే ఖర్చు చేస్తారు. ఆయన ప్రయత్నాలు ఫలించి, మైక్రోసాఫ్ట్, యాపిల్, గూగుల్ వంటి సంస్థలు నవ్యాంధ్రలో తమ కార్యాలయాలను పెట్టడానికి అంగీకరిస్తే లాభమెవరికీ? భవిష్య తరాలకే కదా. హైదరాబాద్‌లో వచ్చిన ఐటీ కంపెనీల ఫలితాల్ని పొందుతున్న దెవరు. మనమూ మన పిల్లలే కదా. నవ్యాంధ్రకు మెరుగులు దిద్దేందుకు చంద్రబాబు అమెరికాలో ప్రయత్నాలు మొదలు పెట్టి రెండు రోజులు దాటింది. ఈ రెండ్రోజుల్లో అనేక సమావేశాల్లో పాల్గొన్నారు చంద్రబాబు. శాన్ఫ్రాన్సిస్కోలో అడుగుపెట్టిన వెంటనే ఆయన కార్యక్రమాలు ప్రారంభమైపోయాయి. సాధారణంగా విమాన ప్రయాణం చేసొచ్చిన వారు కొద్దిగంటలు నిద్రపోతేనే కానీ సాధారణ స్థితికి రాలేరు. చంద్రబాబు చురుకుదనాన్ని చూసి, నెటిజెన్లు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. దేవుడు ఆయన డీఎన్ఏలో అలసటనేదే లేనట్టుగా ఉందంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
తొలి సమావేశంలో ప్రపంచంలోనే రెండో అతి పెద్ద ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ ఫ్లెక్స్‌ట్రానిక్స్ సి.ఇ.ఓ. మైక్మెక్నమరతో భేటీ అయ్యారు. ఆంధ్ర ప్రదేశ్‌లో ఉన్న సౌకర్యాలను వివరించి, వాటిని వినియోగించుకోవాలని కోరారు. ఆగ్నేయాసియా దేశాల రాకపోకలకు వీలుగా తమ రాష్ట్రం కోస్తా తీరం కేంద్రకంగా వున్న విషయాన్ని ప్రస్తావించారు. దేశంలోనే అత్యుత్తమ లాజిస్టిక్ హబ్‌గా మారనున్న ఏపీలో ఇప్పుడు పెట్టుబడులు పెట్టేందుకు తగిన సమయం ఇదేనని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం కాలిఫోర్నియా వెళ్ళి, గవర్నర్ ఎడ్మండ్ గెరాల్డ్ జెర్రీ బ్రౌన్‌ను కలిశారు. నిర్మాణ దశలో ఉన్న అమరావతిని సందర్శించి, తగు సూచనలు ఇవ్వాలని ఆయనను కోరారు.
రెండో రోజున గూగుల్ ఎక్స్ కార్యాలయాన్ని సందర్శించారు. ఏపీతో కలిసి పనిచేయడానికి ఆ సంస్థ ముందుకొచ్చింది. గూగుల్ ఉపాధ్యక్షుడు టామ్ మూర్, ఎఆర్ఎమ్ హోల్డింగ్స్ సిఇఓ సైమన్ ఆంథోనీ సెగర్స్, ఎలక్ట్రికల్ వెహికిల్ కంపెనీ నియో సిఇఓ పద్మశ్రీ వారియర్లతోనూ చంద్రబాబు సమావేశమయ్యారు. భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం లాస్ఏంజెల్స్లో టెస్లీ అధ్యక్షుడు ఎలోన్ మస్క్‌తోనూ, ఆపిల్ సిఓఓ జెఫ్ విలియమ్స్తోనూ సమావేశమయ్యారు.
గతంలోనూ ముఖ్యమంత్రులగా పనిచేసిన వారికీ.. చంద్రబాబుకూ ఇదీ తేడా. ఈనాడు గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు ప్రణాళిక 20 ఏళ్ళ తరవాత ఏం చేయాలి అనే అంశంపై ఉంటుంది. చంద్రబాబు కూడా ఇదే పుణికిపుచ్చుకున్నట్లు కనిపిస్తోంది. ఆయన చేస్తున్న ఈ కృషి.. నవ్యాంధ్ర రాజధాని అమరావతిని కచ్చితంగా ప్రపంచపటంలో నిలబెడుతుంది.
-సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి