మొదటిసారి సచివాలయానికి వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం లభించింది. తన ఛాంబర్ కు తొలిసారి వచ్చిన పవన్ ను సీటులో నుంచి లేచి ఎదురెల్లి ఆలింగం చేసుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వాగతం పలికారు. సెక్రటేరియట్ లో పవన్ కు కేటాయించిన ఛాంబర్ ను పరిశీలించిన అనంతరం వీరిద్దరూ భేటీ అయ్యారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలన అంశాలు వీరిద్దరి మధ్య భేటీలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
ఇక, పవన్ కళ్యాణ్ మొదటిసారిగా సచివాలయానికి వెళ్తున్నారని తెలియడంతో అమరావతి రైతులు, అభిమానులు జనసేనానిపై పూల వర్షం కురిపించారు. పవన్ ను ప్రజా ప్రతినిధిగా చూడాలనే కల నెరవేరడం.. ఆయన ఉప ముఖ్యమంత్రి హోదాలో సెక్రటేరియట్ కు వెళ్తుండటంతో అభిమానులు తెగ సంబరపడిపోయారు.
రాజధాని దారులన్నీ జయహో జనసేనాని అంటూ నినాదాలతో హోరెత్తింది. పవన్ వెంట అభిమానులు, కార్యకర్తలు సచివాలయం వరకు ర్యాలీ తీశారు. అడుగడుగునా స్వాగతం పలుకుతూ ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. తాము ఎప్పుడెప్పుడు అని ఎదురుచూసిన కల తాజాగా సాకారం కావడం పట్ల జన సైనికులు సంతోషం వ్యక్తం చేశారు.