ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు “ఎన్టీఆర్ భరోసా” కింద లబ్దిదారులకు పెన్షన్ లను పంపిణీ చేశారు. మంగళగిరి నియోజకవర్గం పెనుమాక ఎస్టీ కాలనీలోపాముల నాయక్ కుటుంబానికి నేరుగా పెన్షన్ అందించారు చంద్రబాబు.
మంత్రి లోకేష్ , అధికారులతో కలిసి పెనుమాక చేరుకున్న చంద్రబాబు..సోమవారం ఉదయమే పాముల నాయక్ కు వృద్దాప్య పెన్షన్ ను అందజేశారు. పూరిగుడిసెలో ఉన్న లబ్దిదారుడి కుటుంబంతో మాట్లాడిన చంద్రబాబు.. వారికి త్వరలోనే ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా లబ్దిదారుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన టీ తాగి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పేదరికంలో మగ్గే కుటుంబాలు పిల్లలను బాగా చదివించాలని, చదువే పేదరికం నుంచి విముక్తి చేస్తుందన్నారు.
ఇక, వైసీపీ హయాంలో పెన్షన్ దారులకు 3000 పంపిణీ చేయగా..కూటమి అధికారంలోకి వచ్చాక ఆ మొత్తాన్ని ఒకేసారి 1000 రూపాయలు పెంచి నాలుగు వేలకు పెంచారు. ఏప్రిల్ నుంచే పెంచిన మొత్తాన్ని ఇస్తామని హామీ మేరకు గత మూడు నెలలకు 1000ల చొప్పున 7వేల రూపాయలు పంపిణీ చేస్తున్నారు. పెన్షన్ పంపిణీలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని ఆదేశించిన సర్కార్..మొదటి రోజే 100శాతం పంపిణీ అయ్యేలా చూడాలని స్పష్టం చేసింది. దీంతో ఏపీలో పండగ వాతావరణం కనిపిస్తోంది.