ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహించారు, క్లాస్ తీసుకున్నారు, పనితీరు మెరుగుపరచుకోవాలన్నారు.. ఇలాంటివి రొటీన్ వార్తలే. ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. కానీ, తాజాగా తీసుకున్న క్లాస్ మాత్రం కాస్త ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే, ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ సమావేశాలను ప్రతిపక్షం వైకాపా బహిష్కరించింది. కాబట్టి, సమావేశాలను అర్థవంతంగా నిర్వహించాలని మొదట్నుంచీ పార్టీ ఎమ్మెల్యేలతో చంద్రబాబు చెబుతూ వచ్చారు. ఈ మధ్య వరుసగా ఓ నాలుగు రోజులు అసెంబ్లీకి సెలవులు వచ్చాయి. పెళ్లిళ్లు, శుభకార్యాలు ఉన్న నేపథ్యంలో సమావేశాలకు బ్రేక్ పడింది. అయితే, సోమవారం సభ సమావేశం కాగానే… టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్య కాస్త తక్కువగా కనిపించింది. దీంతో ముఖ్యమంత్రి ఆగ్రహించారు. సమావేశం విరామ సమయంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, విప్ లను పిలిచించి ఓ సమావేశం ఏర్పాటు చేసి.. క్లాస్ తీసుకున్నారు.
నాలుగు రోజులు సెలవులు సరిపోవా, అందరూ సమావేశాలకు ఎందుకు రావడం లేదు, సమయానికి సభలో ఎందుకు ఉండటం లేదంటూ సీఎం క్లాస్ తీసుకున్నారట. అంతేకాదు, సమావేశాల జరుగుతున్న సమయంలో ఏయే నేతలు సభకు ఎన్నిగంటలకు వస్తున్నారూ, మధ్యలో ఎన్నిసార్లు బయటకి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు.. ఇలాంటి వివరాలపై కూడా ముఖ్యమంత్రి ఆరా తీశారు. సిబ్బందిని అడిగి మరీ హాజరు వివరాలు తెప్పించుకున్నారు. ప్రతిపక్షం సభలో లేదనీ, కాబట్టి సమావేశాలు జరుగుతున్న అన్ని రోజులూ ఎమ్మెల్యేలు తప్పకుండా హాజరు కావాలని చంద్రబాబు అన్నారట. ప్రతిపక్ష పార్టీ పాదయాత్ర అంటూ ప్రజల్లో ఉందనీ, సభలో మన తీరు ఏమాత్రం సరిగా లేకపోయినా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని సీఎం క్లాస్ తీసుకున్నట్టు సమాచారం.
ఇదే సమయంలో వచ్చే ఎన్నికలకు సంబంధించి కూడా సీఎం ఘాటుగా మాట్లాడినట్టు తెలుస్తోంది. 2019లో రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజక వర్గాల్లోనూ టీడీపీ గెలిచి తీరాలనీ, ఈసారి గెలవకపోతే నాయకులు ఎవరైనాసరే… వారికి రాజకీయ భవిష్యత్తు ఉండదని కూడా సీఎం వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. పరిస్థితులను ఈజీగా తీసుకోవద్దనీ, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనీ, మీ నియోజక వర్గాల్లో ఉన్న సమస్యల్ని సభలో ప్రస్థావించాలనీ, అసెంబ్లీ అనేది ఒక వేదికగా భావించి అర్థవంతమైన చర్చలు జరిగేందుకు అందరూ కృషి చేయాలని సీఎం క్లాస్ తీసుకున్నారని సమాచారం. సో… సభ జరగనున్న ఈ కొద్దిరోజులూ ఎమ్మెల్యేలు కచ్చితంగా హాజరు అవుతారు! ప్రశ్నలు వేస్తారు. చర్చలు చేపడతారు. వచ్చే ఎన్నికలూ రాజకీయ భవిష్యత్తు వరకూ సీఎం క్లాస్ తీసుకుంటే, ఎవరైనా సభకు రాకుండా ఉంటారా చెప్పండీ..! ఏదేమైనా, ప్రతిపక్షం సభకు రాకపోవడం, జగన్ జనంలో ఉండటం అనేది కూడా అధికార పక్షంలోని కొంత అప్రమత్తతను పెంచే అంశంగా కూడా చూడొచ్చు.