ఐదేళ్ల తర్వాత ఏపీ ప్రజలకు మళ్లీ స్వాతంత్ర్యం వచ్చినట్లు ఉందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎంతో నమ్మకంతో రాష్ట్ర ప్రజలు కూటమికి ఏకపక్ష విజయం కట్టబెట్టారని, కొత్త ప్రభుత్వంపై ప్రజల నమ్మకాన్ని నిలబెడుతామన్నారు. సుపరిపాలనకు తొలిరోజు నుంచే కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్న చంద్రబాబు..సంక్షేమం, అభివృద్ధి ఎజెండాగా పాలన కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఏపీ బ్రాండ్ ను తిరిగి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి అనంతరం చంద్రబాబు మాట్లాడారు. విభజనతో ఏర్పడిన నవ్యాంధ్రకు రాజధాని లేని పరిస్థితుల్లో నాడు పాలన సాగించాం.. అనుభవం , ప్రజల సహకారం కష్టపడే విధానంతో తక్కువ కాలంలోనే అభివృద్ధి వైపు అడుగులు వేశామన్నారు చంద్రబాబు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా ముందుకు వెళ్ళినట్లు చెప్పారు. ఎవరూ ఊహించని విధంగా సంస్కరణలతో 13.5శాతం వృద్ది రేటుతో నిలిచామన్నారు. 120కి పైగా సంక్షేమ పథకాలతో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచామన్నారు. 16లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నట్లు వివరించారు. రాజధాని లేని రాష్ట్రమని బాధతో కూర్చోలేదని, సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకొని.. ప్రజలందరూ గర్వించేలా రాజధానికి శంకుస్థాపన చేసుకున్నామని తెలిపారు. ప్రజల సహకారంతో 34వేల ఎకరాల భూసేకరణ చేశామని వెల్లడించారు.
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్ముతాను..అందుకే సాగునీటి రంగానికి ప్రాధాన్యత ఇచ్చాం. 2014-19 ఐదేళ్లలో 68వేల కోట్లు సాగునీటి రంగంపై ఖర్చు చేశాం.. పోలవరం ప్రాజెక్టుకు మోస్ట్ ప్రియార్టి ఇచ్చామన్నారు. ఓ యజ్ఞం మాదిరి పోలవరం పనులను పరుగులు పెట్టించామని, 2019 లొనూ టీడీపీ అధికారంలోకి వచ్చుంటే ప్రాజెక్టు ఈపాటికి పూర్తయి ఉండేదన్నారు చంద్రబాబు.
ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన పాలకులు విధ్వంస పాలన కొనసాగించారు. బాధితులనే నిందితులుగా చేశారని మండిపడ్డారు చంద్రబాబు. నియంత విధానాలు, పరదాల పాలనత రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారన్నారు. ప్రభుత్వ భూములు, ఆస్తులు దోచుకున్నారని జగన్ పాలనను దుయ్యబట్టారు. ప్రశ్నిస్తే దాడులు, కేసులు , అరెస్టులతో వేధించారని చెప్పారు. ప్రజా వేదిక కూల్చివేతతో విధ్వంస పాలనకు శ్రీకారం చుట్టారని తెలిపారు. లక్ష కోట్ల ప్రజా ధనం కొల్లగొట్టారు. సంపద సృష్టి లేదు..పోలవరం ప్రాజెక్టును నాశనం చేసి ప్రజలకు అన్యాయం చేశారని నిప్పులు చెరిగారు.
విభజన కంటే రివర్స్ పాలనతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని, గత ప్రభుత్వ అసమర్ధ విధానాలతో రాష్ట్రం 9 లక్షల 74వేల కోట్ల అప్పులకు చేరుకుందన్నారు. తలదరి ఆదాయం 13.2శాతం నుంచి 9. 5 శాతానికి తగ్గింది. ఇందుకు గత ప్రభుత్వ విధానాలే కారణమని వివరించారు చంద్రబాబు. పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలను గత ప్రభుత్వం చేయలేదని విమర్శించారు. భవిష్యత్ లో వచ్చే ఆదాయాన్ని సైతం తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారని వివరించారు. చీకటి పాలనతో విసిగిపోయిన ప్రజలు.. ఘోరంగా ఓడించారన్నారు.