2047నాటికి ఏపీని దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆ దిశగా పాలన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కర్నూల్ జిల్లా పుచ్చకాయలమడలో పెన్షన్ పంపిణీ అనంతరం గ్రామ సభలో పాల్గొని చంద్రబాబు మాట్లాడారు. గత ప్రభుత్వంలో సీఎం మీటింగ్ అంటే పరదాలు కట్టేవారు.. చెట్లు కొట్టేసేవారు..సీఎం మీటింగ్ అంటే ప్రజలకు నరకం కనిపించేది..ఇప్పుడు అలాంటి అసౌకర్యాలు లేకుండా ప్రజలందరి సమక్షంలో మీటింగ్ జరుపుకునే స్వేఛ్చ వచ్చిందని చెప్పుకొచ్చారు.
కూటమి ప్రభుత్వం వచ్చాక పెన్షన్ 4వేలకు పెంచాం.. ఒకటో తేదీనే అధికారులు మీ ఇంటికొచ్చి పెన్షన్లు ఇస్తున్నారు. ఇలాగే పెన్షన్ పంపిణీని శాశ్వతంగా కొనసాగిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఒకప్పుడు ఉద్యోగులకు జీతాలు కూడా సరిగా వచ్చేవి కాదు..ఇప్పుడు ఉద్యోగులకు నెలనెలా జీతాలు, పెన్షన్లు ఇస్తున్నాం. జీతాల గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని భరోసా ఇచ్చారు.
రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు, ప్రతి ఎకరాకు నీరు ఇవ్వాలనేది తన అభిమతమని అన్నారు చంద్రబాబు. గండ్రేవుల , గురు రాఘవేంద్ర, ఆర్డీఎస్ పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నామని వివరించారు. రాయలసీమలో 7.5లక్షల ఉద్యోగాల కల్పనకు శ్రీకారం చుట్టబోతున్నట్లు వివరించారు. సోలార్ , విండ్ పవర్ ఉత్పత్తికి భారీ ఎత్తున కార్యాచరణ సిద్దం చేస్తున్నామని.. దీని ద్వారా సీమను గ్రీన్ ఎనర్జీ హబ్ గా మార్చబోతున్నట్లు ప్రకటించారు. నూతన మధ్య విధానం అమల్లోకి తీసుకొచ్చామని , కొత్త మద్య విధానంతో శెట్టిబలిజ, ఈడిగ , గౌడలకు 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు.
కర్నూల్ నుంచి బళ్లారికి జాతీయ రహదారి తెస్తామన్నారు చంద్రబాబు. ఓర్వకల్లులో పరిశ్రమలు చేసి అభివృద్ధి చేస్తామని తెలిపారు. కర్నూల్ లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని మరోసారి స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నాం. మెగా డీఎస్సీపై మొదటి సంతకం చేశాను. 20లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పానని గుర్తు చేశారు.
వాలంటీర్లు లేకుండా ఎలాంటి పని కాదని వైసీపీ నేతలు మాట్లాడారని.. కానీ వారు లేకుండానే పెన్షన్ పంపిణీ చేస్తున్నామని చెప్పారు. వాలంటీర్లను ఏం చేయాలో ఆలోచిస్తున్నామని చెప్పారు. దీపావళి నుంచి మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తామని..గ్యాస్ సిలిండర్ పంపిణీని దీపావళి రోజు ప్రారంభిస్తామని చెప్పారు.