ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో చారిత్మక విజయం సాధించిన చంద్రబాబు ప్రజల ఆకాంక్షలను సాకారం చేసేందుకు మొదటి ఐదు సంతకాలు చేశారు. మెగా డీఎస్సీ, ప్రజల్లో తీవ్ర ఆందోళనను రేకెత్తించిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, సామాజిక ఫించన్ల పెంపు, అన్న క్యాంటీన్ ల పునరుద్దరణతో పాటు నైపుణ్య గణన ఫైల్స్ పై చంద్రబాబు సంతకాలు పెట్టారు. గురువారం సాయంత్రం సచివాలయంలో వేద పండితుల ఆశీర్వాదం మధ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన అనంతరం ఈ సంతకాలను చేశారు.
కూటమి అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీతో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. మొదటి సంతకం కూడా డీఎస్సీ ఫైల్ పైనే చేస్తానంటూ హమీ ఇవ్వడంతో ఆ ప్రకారమే మొదటి సంతకం డీఎస్సీ ఫైల్ పై చేశారు. ప్రభుత్వ పాఠశాలలో 16వేల ఖాళీలు ఉన్నట్లుగా ఇప్పటికే అధికారులు గుర్తించడంతో వీటిపై విద్యాశాఖ అధికారులతో చంద్రబాబు చర్చించనున్నారు. అనంతరం ఉపాధ్యాయ ఖాళీలపై అధికారిక ప్రకటన చేయనున్నారు.
వైసీపీ తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేసింది.ప్రజల ఆస్తుల కాజేసేందుకు వైసీపీ సర్కార్ ఈ చట్టం తీసుకొచ్చిందని తమ ప్రభుత్వం ఏర్పడగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం చేశారు.
సామాజిక ఫించన్లను మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచుతామని, దివ్యాంగులకు ఆరు వేలు ఇస్తామని చంద్రబాబు చెప్పారు. ఈ హామీలను నెరవేరుస్తూ చంద్రబాబు మూడో సంతకం చేశారు.
గత టీడీపీ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 183అన్న క్యాంటీన్లు ప్రారంభించారు. పేదల ఆకలి తీర్చే ఉద్దేశంతో చంద్రబాబు వీటిని ప్రారంభించారు. కానీ, చంద్రబాబుపై అక్కసుతో వైసీపీ అధికారంలోకి వచ్చాక అన్న క్యాంటీన్లను మూసివేసింది. దాంతో తాము అధికారంలోకి వచ్చాక అన్న క్యాంటీన్లను పునరుద్దరిస్తామని హామీ ఇచ్చినట్టుగానే వీటిపై నాలుగో సంతకం చేశారు.
యువత ఉన్నత విద్యను అభ్యసించినా అందుకు తగ్గ ఉద్యోగాలు పొందలేకపోతుంది. అందుకు వారిలో నైపుణ్యం లేకపోవడమే కారణంగా గుర్తించారు.దీనిని గుర్తించిన టీడీపీ నైపుణ్య గణనపై హామీ ఇచ్చింది. ఎవరిలో ఎలాంటి నైపుణ్యాలు ఉన్నాయో తెలుసుకొని వాటి ఆధారంగా శిక్షణ ఇచ్చి నిరుద్యోగాన్ని తగ్గించడమే ఈ నైపుణ్య గణన ఎజెండా. ఇచ్చిన హామీ ప్రకారం వీటిపై చంద్రబాబు ఐదో సంతకం చేశారు.