స్వచ్చ ఆంధ్రప్రదేశ్ ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని..2029 కల్లా ఏపీని స్వచ్చ ఆంధ్రప్రదేశ్ గా మారుస్తామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రజల ఆరోగ్యం బాగుందంటే అందుకు కారణం స్వచ్చ సేవకులేనని..ప్రతి ఒక్కరు స్వచ్చ సేవకులు కావాలని పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో స్వచ్చతాహీ సేవలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని మాట్లాడారు.
2014అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా స్వచ్చ భారత్ కు ప్రధాని మోడీ శ్రీకారం చుట్టారు. ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టిన ప్రధాని మోడీకి అందరం అభినందనలు తెలియజేయాలన్నారు. నీతి అయోగ్ లో స్వచ్చ భారత్ పై ఉప సంఘం ఏర్పాటు చేశారు. ఈ ఉప సంఘానికి తాను చైర్మన్ గా ఉన్నానని చంద్రబాబు చెప్పారు.
2019లో వచ్చిన ప్రభుత్వం వ్యవస్థలను చిన్నాభిన్నం చేసిందని చంద్రబాబు మండిపడ్డారు. రోడ్లపైచెత్త పేరుకుపోయింది. అందుకే చెత్త నుంచి సంపదను సృష్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టానని చెప్పారు. 1998లో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని తీసుకొచ్చాను. ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చానన్నారు. భవిష్యత్ లో రోడ్లపై చెత్త ఉండకూడదని అన్నారు. నేటి నుంచి రాష్ట్రంలో చెత్త పన్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
“2 లక్షలకు పైగా వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించాం..85లక్షల మెట్రిక్ టన్నుల చెత్త కుప్పలుగా పేరుకుపోయింది. సంవత్సరంలోపు చెత్త మొత్తం శుభ్రం చేయాలని మంత్రి నారాయణను ఆదేశించాను. విజయవాడ వరదల సమయంలో ప్రజల వెంబడి ఉన్నాను..పట్టుదల , మానవత్వంతో విజయవాడ వరదల సమయంలో పని చేశాను. పారిశుద్ధ్య కార్మికుల కృషి వల్లే విజయవాడలో అంటువ్యాధులు ప్రబలలేదని ” వివరించారు చంద్రబాబు.