ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు జులై 4న ఢిల్లీ వెళ్లనున్నారు. త్వరలో కేంద్రం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో ఏపీకి కేటాయింపులు, రావాల్సిన నిధులు, రాష్ట్రానికి కేంద్రం సహకారంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సహా పలువురు కేంద్రమంత్రులతో చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది.
గత ప్రభుత్వం అప్పుల పేరిట ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయడంతో వ్యవస్థను గాడినపెట్టాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్రం సహకారం తప్పనిసరి కావడంతో కేంద్రం మద్దతుతో రాష్ట్రాభివృద్ది విషయంలో ముందుకు వెళ్లాలనేది చంద్రబాబు ఆలోచన. అందుకే బడ్జెట్ కేటాయింపులపై ముందుగానే కేంద్ర మంత్రులతో సమావేశమై చర్చించబోతున్నారు.
కీలకమైన అమరావతి, పోలవరం నిర్మాణాల కోసం కేంద్రం సహకారం కోరనున్నారు చంద్రబాబు. పోలవరం పూర్తి చేయడంతోపాటు, రాజధానిగా అమరావతికి ఓ రూపునివ్వాలని టార్గెట్ గా పెట్టుకున్న చంద్రబాబు ఈ రెండింటికి కేంద్రం పూర్తి స్థాయిలో సహకరించాలని విజ్ఞప్తి చేయనున్నారు. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టాక మొదటి ఢిల్లీ పర్యటన కావడంతో ప్రధాని మోడీని కూడా కలిసే అవకాశం ఉంది.