బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. శుక్రవారం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో పలు ప్రాంతాలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్ళలోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
విజయవాడలో శుక్రవారం నుంచి వర్షం దంచికొడుతుండటంతో.. ఎక్కడ చూసినా వర్షపు నీరే కనిపిస్తోంది. నెహ్రూ బస్టాండ్ నీట మునిగింది. ఆర్టీసీ బస్సులు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పలు చోట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ఇంద్రకీలాద్రిపై కొండచరియలు విరిగి పడటంతో దేవాలయంలో బండరాళ్ళు పడ్డాయి. ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.
గుట్టకు మరోవైపున కొండ చరియలు విరిగిపడగా.. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. కొండచరియలు ఇళ్ళపై పడటంతో ఈ విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటన గురించి తెలుసుకున్న సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని..బాధిత కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం అందిస్తామన్నారు. భారీ వర్ష సూచన నేపథ్యంలో స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు.
ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో చంద్రబాబు తన పర్యటనలను పూర్తిగా రద్దు చేసుకున్నారు. సచివాలయంలోనే ఉంటూ.. రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితిని సమీక్షిస్తూ కీలక ఆదేశాలు ఇస్తున్నారు. ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్దంగా ఉండాలని అప్రమత్తం చేస్తున్నారు.