రాయలసీమ, నెల్లూరు జిల్లాలో వరదలు వచ్చినా అసెంబ్లీ కనీసం పట్టించుకోదు. కనీసం వాయిదా కూడా వేసుకోలేదు. సీఎం జగన్ ప్రత్యక్ష పర్యటనకు వెళ్లలేదు. కానీ చివరి రోజు అసెంబ్లీలో వరదల అంశంపై మాట్లాడిన సీఎం.. వరద బాధితులందరికీ సాయం చేసేశామని.. వారంతా హ్యాపీగా ఉన్నారని స్పష్టం చేశారు. ఇక బాలినేని శ్రీనివాసరెడ్డితోనూ వరద బాధితులు ఎలా ఉన్నారో జగన్ చెప్పించారు. అధికారులు తీసుకున్న చర్యలతో వరద బాధితులు హ్యాపీగా ఉన్నారని ఆయన కూడా సర్టిఫికెట్ ఇచ్చారు.
నిజంగా పాలకులు అనే వారికి కనీస మనసు ఉంటే.. చలించే తత్వం ఉంటే ఇలాంటి మాటలు మాట్లాడనే మాట్లాడరు. ఎందుకంటే వరద దెబ్బకు సర్వం కోల్పోయిన వారికి ప్రభుత్వం టార్పాలిన్లు మాత్రమే ఇచ్చింది. వారికి కూడు, గుడ్డ, నీరు లేకుండా.. ఎవరో వచ్చే దాతలు ఇచ్చే వాటితో వారు సంతృప్తి పడతారా ?. ఇప్పటికే అనేక కాలనీలు నీళ్లలో ఉన్నాయి. అనేక మంది రేపేమిటి అని బాధపడుతున్నారు. గల్లంతయి ఇప్పటికీ ఆచూకీ తెలియని వారి సంఖ్య పదమూడు అని అక్కడి పోలీసు అధికారులు స్పష్టం గా చెబుతున్నారు. ఆ కుటుంబాల వేదన గురించి కనీసం పాలకులు ఆలోచించలేదు.
కొన్ని వందల కుటుంబాలు.. రోడ్డున పడ్డాయి. కొన్ని వేల కుటుంబాలు నష్టపోయాయి. ప్రభుత్వం ఇచ్చే రూ. వెయ్యి.. రెండు వేలతో వారు సంతృప్తి పడే అవకాశాలే లేవు. ముందు ప్రభుత్వం వారికి భరోసా కల్పించాల్సి ఉంది. కానీ కొంత ధన సహాయం చేసి దానితో వారంతా సంతృప్తిగా ఉన్నారని పాలకులు ప్రకటించేస్తున్నారు. బాధితుల పట్ల ఇంత నిర్ధాక్షిణ్యంగా వ్యవహరించే సర్కార్ గతంలో ఉండదేమో అన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది.
నిజానికి కలెక్టర్ , మంత్రులు, ఎమ్మెల్యేలు ఇలా ఎవరు బాధితుల వద్దకు వెళ్లినా వాళ్లకు తీవ్రమైన నిరసన ఎదురవుతోంది. అందుకే ఎవరూ వెళ్లడానికి సాహసించడం లేదు. ఎవరూ తమను పట్టించుకోవడం లేదని బాధితులు మీడియా ముందు ఆందోళనచెందుతున్నారు. కానీ పాలకులు మాత్రం అసెంబ్లీలో పొగడ్తలు వినిపించుకుంటూ.. మనసు నింపుకుంటున్నారు.