హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు పనులు ఎప్పటికి పూర్తవుతాయనేది మిలియన్ డాలర్ల ప్రశ్న అనేది నగర ప్రజల అభిప్రాయం. తెలంగాణ రాష్ట్రంలో పనుల వేగంగా జరుగుతాయని ఆశిస్తే అలా జరగడం లేదు. దీనికి సవాలక్ష కారణాలు. అయితే ఇకమీదట సత్వరం పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.
ఎల్ అండ్ టి కంపెనీ ప్రతినిధులు, ఉన్నతాధికారులతో ఆయన మెట్రో పనులపై బుధవారం చర్చించారు. అధికారిక నివాసంలో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. పనుల తీరును సమీక్షించారు. గత కొంత కాలంగా పనులు మందగించిన విషయం ప్రస్తావనకు వచ్చింది. మెట్రో పనులను త్వరగా పూర్తి చేయడానికి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందన్నారు. ప్రభుత్వం వైపు నుంచి ఇబ్బందులు గానీ ఆటంకాలు గానీ ఉండవని ఆయన భరోసా ఇచ్చారని సమాచారం.
కనీసం ఏడాది కాలంలో కీలకమైన దశ పూర్తి చేయాలనేది కేసీఆర్ ఉద్దేశం. అందుకే 2017 నవంబర్ నాటికి ఎల్ బి నగర్ – మియాపూర్ లైన్ పనులను పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. 2018 నాటికి మొత్తం మెట్రో ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని కూడా ఆదేశించారు.
మెట్రో పనులు మరింత ఆలస్యమైతే ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతుందని తెరాస ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. 2019 ఎన్నికలకు కొన్ని నెలల ముందు మెట్రో రైలు అందుబాటులోకి రావాలనేది ప్రభుత్వ ఉద్దేశం. కాబట్టి డెడ్ లైన్ విధించడం, ప్రభుత్వ పరంగా సహకరించడం ద్వారా పనులను త్వరగా పూర్తి చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు.