జమ్మలమడుగు అసెంబ్లీ టిక్కెట్ విషయాన్ని తేల్చడానికి చంద్రబాబు ఎన్ని సార్లు సమావేశాలు పెట్టినా… పంచాయతీ మాత్రం తేలడం లేదు. ఎమ్మెల్యే టిక్కెట్ తమకంటే తమకని… ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి తెగేసి చెబుతున్నారు. ముఖ్యమంత్రి ముందు తమ వాదనలను బలంగా వినిపిస్తున్నారు. రామసుబ్బారెడ్డి , ఆదినారాయణ రెడ్డి తన సోదరులతో కలిసి ముఖ్యమంత్రి వద్దకు వచ్చారు. మూడు గంటల పాటు ఎవరి వాదనను వారు వినిపించారు. తమకే జమ్మలమడుగు ఎమ్మెల్యే టిక్కెట్ కావాలని ఇరువురూ ఒకే వాదనను వినిపించడంతో .. ఇక తానే నిర్ణయం తీసుకుంటానని కట్టుబడి ఉండాలని ఆదేశించారు. దానికి అప్పటికి ఇద్దరూ అంగీకరించారు. ఇరువర్గాలకు కలిపి జమ్మల మడుగులో సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు టీడీపీ నేతలు.
సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆదినారాయణరెడ్డికే ముఖ్యమంత్రి అవకాశం ఇస్తారని భావిస్తున్నారు. ఎంపీగా పోటీ చేయాలో…ఎమ్మెల్యేగా పోటీ చేయాలో సీఎం నిర్ణయిస్తారని ఆదినారాయణరెడ్డి చెబుతున్నారు. కలిసి పనిచేయడం ఇబ్బందికరమే అయినా.. కార్యకర్తలను ఒప్పిస్తామన్నారు. నాతోపాటు వైసీపీ కార్యకర్తలు, నేతలు రాలేదనే ప్రచారం సరికాదని అందరం వచ్చాం కాబట్టే బీటెక్ రవిని గెలిపించామని వాదిస్తున్నారు. మరో వైపు.. ఎంపీ స్థానానికి పోటీ చేయడం … అందుకు కార్యకర్తలను ఒప్పించడం అంత తేలిక కాదని.. రామసుబ్బారెడ్డి చెబుతున్నారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో 37 సంవత్సరాల నుంచి ఫ్యాక్షన్ వివాదాలు నెలకొని ఉన్నాయని, ఇప్పడు రెండు వర్గాలు రాజీ పడటం సాధ్యం కాదని రామసుబ్బారెడ్డి అనుచరులు చెబుతున్నారు.
రామసుబ్బారెడ్డి వర్గీయులు ఇప్పుడు స్వతంత్రంగా పోటీ చేయాలన్న వాదనను కూడా తెరపైకి తెస్తున్నారు. ఎలాంటి పరిస్థితులు ఉన్నా… రామసుబ్బారెడ్డి వర్గీయులు.. ఆదినారాయణరెడ్డికి ఓట్లేయరని… చెబుతున్నారు. పార్లమెంట్ కు పోటీ చేయడానికి… తన వర్గీయులు ఒప్పుకోరని.. చెబుతున్నారు. మొత్తానికి జమ్మల మడుగు పంచాయతీని తీర్చడానికి నెల రోజులుగా సీఎం చేసిన ప్రయత్నం విఫలమయింది. ఆయన నిర్ణయం ఆధారంగా.. జమ్మల మడుగులో మిగతా రాజకీయాలు ఉండబోతున్నాయి.