ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులు …చేపల వేటకు వెళ్లి ఇతర దేశాలకు చిక్కిన ఘటనలు తరచూ జరుగుతూ ఉంటాయి. ఇలా వందల మంది తెలుగు మత్స్యకారులు పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక వంటి దేశాల్లో చిక్కుకుపోతూ ఉంటారు. వారిని విడిపించడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. పాకిస్తాన్ లో చిక్కుకుపోతే మాత్రం వారిని తీసుకు రావడం కష్టం అవుతోంది. ఇలా ఏపీ మత్స్యకారులకు మళ్లీ కష్టాలు రాకుండా.. ఏపీలోనే ఫిషింగ్ హార్బర్లు నిర్మించాలని ముఖ్యమంత్రి జగన్ సంకల్పించారు. వాటికి మత్స్యకార దినోత్సవం సందర్భంగా శంకుస్థాపన చేశారు.
నాలుగు ఫిషింగ్ హార్బర్లు, 25 ఆక్వా హబ్‌లకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో భూమిపూజ చేశారు. రూ.1,510 కోట్లతో నాలుగు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపడుతున్నారు. నియోజకవర్గానికి ఒక ఆక్వా హబ్ ఏర్పాటు చేస్తారు. మచిలీపట్నం, నిజాంపట్నం, జువ్వలదిన్నె, ఉప్పాడలో ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఏపీలో 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్నా మత్స్యకారుల జీవితాలు దయనీయ స్థితిలో ఉన్నాయని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.
మొత్తంగా మూడు వేల కోట్లతో 8 చోట్ల ఫిషింగ్ హార్బర్లు, ఒక ఫిష్ ల్యాండ్ నిర్మాణం చేయాలని గతంలో నిర్ణయించారు. శ్రీకాకుళం జిల్లాలోని మంచినీళ్లపేటలో ఫిష్ ల్యాండ్ ను ఏర్పాటు చేయనున్నారు. రెండున్నర మూడు సంవత్సరాల వ్యవధిలో వీటి నిర్మాణం పూర్తి చేయనున్నారు. వీటి నిర్మాణం పూర్తయిన తర్వాత ఏపీ జాలర్లు.. ఇక ఇతర ప్రాంతాలకు వేట కోసం వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఇక్కడి నుంచే వేట చేసుకోవచ్చు. ఇది మత్స్యకార జీవితాల్లో మార్పు తేవడానికి ఉపయోగపడుతుంది.