ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్క రోజు అసెంబ్లీ సమావేశంలో ప్రసంగించారు. ఆయన ప్రజల ప్రాణాలను కాపాడేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. చాలా అంశాలను ఎప్పుడూ చెప్పేవే చెప్పారు కానీ.. కొత్తగా వ్యాక్సినేషన్ విషయంలో కాస్త భిన్నమైన మాటలు మాట్లాడారు. అందరికీ ఉచిత వ్యాక్సిన్ వేస్తామని ఆయన గతంలో ప్రకటించారు. రూ. పదహారు వందల కోట్లు దీని కోసం ఖర్చు పెడతామన్నారు. కానీ అసెంబ్లీ సమావేశంలో అన్నీ అనుకూలిస్తే.. దేవుడి ఆశీర్వదిస్తే.. ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ చేస్తామని చెప్పుకొచ్చారు. మహమ్మారి నుంచి బయటపడాలంటే సగం మందికైనా వ్యాక్సిన్ వేయించాలని.. కానీ కేంద్రం వ్యాక్సిన్ డోసులు తక్కువగా ఇస్తోందన్నారు.
గతంలో అన్నట్లుగా చంద్రబాబు బంధువు కంపెనీ ఇవ్వట్లేదని అనలేదు కానీ.. గ్లోబల్ టెండర్లు పిలిచిన తొలి రాష్ట్రంగా పేర్కొన్నారు. మరి గ్లోబల్ టెండర్లలో అయినా వ్యాక్సిన్ ప్రొక్యూర్ చేసి.. అందరికీ టీకా వేస్తారా అన్నదానిపై ఆయన హామీ ఇవ్వలేకపోయారు. వ్యాక్సిన్ డోస్ .. ఒక్కోటి వెయ్యి రూపాయల వరకూ కంపెనీలు కోట్ చేసే అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వానికి భారమవుతుంది. కేంద్రం ఇచ్చే డోసులు తగ్గిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సొంతంగా కొనడం తప్ప వేరే మార్గం లేదు. దేశీయ కంపెనీలైన భారత్ బయోటెక్, సీరం ఇనిస్టిట్యూట్లకు ఏపీ సర్కార్ పెట్టిన ఆర్డర్లేమీ లేవు. దీంతో కేంద్రం ఇచ్చే అరకొర డోసుల పంపిణీ మాత్రమే జరగనుంది.
బడ్జెట్లో వ్యాక్సినేషన్‌కు ప్రత్యేకంగా ఏమీ కేటాయించలేదు. వైద్య ఆరోగ్య శాఖకు కేటాయింపులు .. జీతాలు ఇతర ఖర్చులకే సరిపోతాయి. మరి వ్యాక్సిన్ కొనుగోలు చేస్తారా..? లేదా..? అన్నది సందేహంగా మారింది. అదే సమయంలో దేవుడు ఆశీర్వదిస్తే.. అని జగన్.. షరతులాగా చెప్పడంతో ప్రజల్లో అనుమానాలు ప్రారంభమయ్యే పరిస్థితి వస్తుంది.