వెయ్యో..రెండు వేల కోట్లో అయితే తానే ఏదో విధంగా సర్దేవాడినని కానీ ఇరవై వేల కోట్లకుపైగా కావాలి కాబట్టి ఆలోచిస్తున్నామని పోలవరం నిర్వాసితులకు పరిహారంపై సీఎం జగన్ వ్యాఖ్యానించారు. అందుకే కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామని రెండో రోజుల పోలవరం ముంపు నిర్వాసిత గ్రామాల్లో పర్యటి్తూ వ్యాఖ్యలు చేశారు. జగన్ వ్యాఖ్యలు ముంపు గ్రామాల ప్రజల్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. పోలవరం అంచనాలను గత ప్రభుత్వం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి భారీగా చెల్లించాల్సి ఉన్నందున పెంచినప్పుడు అదంతా చంద్రబాబే తింటున్నారని.. అంచనాలు ఎందుకు పెంచాల్సి వచ్చిందని ఆరోపించడమే కాదు కేంద్రానికి ఫిర్యాదు చేశారు.
ఆ ఫిర్యాదుల ఆధారంగా జగన్ అధికారంలోకి వచ్చాక పూర్తిగా అంచనాలను కేంద్రం తగ్గించేసింది. అర్ అండ్ ఆర్ ప్యాకేజీతో తమకు సంబంధం లేదని కేంద్రం చెబుతోంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హోదాకు బదులుగా ఇస్తామన్న ప్యాకేజీలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని కూడా చేర్చి వంద శాతం ప్రాజెక్టు ఖర్చును భరించేలా ఒప్పందం చేసుకున్నారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత సీన్ మారిపోయింది. ఏపీ సర్కార్ పోలవరం విషయాన్ని పట్టించుకోకపోవడంతో .. సవరించిన అంచనాలను ఆమోదించకపోగా తగ్గించేసింది. ఇప్పుడు పోలవరం విషయంలో తాము ఇచ్చేదేమీ లేదన్నట్లుగా మాట్లాడుతోంది.
మూడేళ్ల కాలంలో పోలవరం నిధుల విషయంలో జగన్ కేంద్రాన్ని అడిగిందేమీ లేదు. డిమాండ్ చేసింది అసలే లేదు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలవరం నిర్వాసితులకు ఎకరానికి పది లక్షలు ఇస్తామని నమ్మించారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడూ పది లక్షల గురించి ప్రస్తావించకపోగా.. ఇప్పుడు హమీై ఇచ్చిన విధంగా ఐదు లక్షలిస్తానని చెబుతున్నారు. అంటే హామీని కూడా మార్చేశారు. జగన్ తీరు చూసి పోలవరం నిర్వాసితులు … హవ్వ అని నోరు నొక్కుకోవడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. పోలవరం ప్రాజెక్టునే కాదు… నిర్వాసితుల్ని కూడా జగన్ నిండా ముంచారన్న అభిప్రాయం వినిపిస్తోంది.