వరదలతో రాయలసీమ, నెల్లూరు జిల్లాలు అతలాకుతలం అయితే కనీసం సీఎం జగన్కు చీమ కుట్టినట్లుగా కూడా లేదని.. సొంత జిల్లా కడపలో తీవ్రమైన ప్రాణ నష్టం జరిగితే అసలు పట్టించుకోలేదని వస్తున్న విమర్శలకు సీఎం జగన్ అసెంబ్లీలో కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా అక్కడ పర్యటనకు వెళ్తే సహాయ కార్యక్రమాలకు ఆటంకాలకు కలుగుతాయనే వెళ్లలేదన్నారు. తాను వెళ్లడం వల్ల అధికారులంతా తన వెంటే తిరుగుతారని దీని వల్ల సహాయం ఆగిపోతుదంన్నారు. అదే సమయంలో తాను ఇంచార్జ్ మంత్రులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు అందర్నీ అక్కడే ఉండమని చెప్పానని గుర్తు చేశారు.
అలాగే రోజూ సమీక్షలు చేస్తూ కావాల్సిన ఆదేశాలు ఎప్పటికప్పుడు ఇస్తున్నానని గుర్తు చేశారు. సహాయ కార్యక్రమాలు పూర్తి చేసిన తర్వాత ఖచ్చితంగా వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించి..అధికారులందరూ సహాయ కార్యక్రమాలు బాగా చేశారా లేదా అనికనుక్కుంటానని స్పష్టం చేశారు. కడప తన సొంత జిల్లా అని .. ప్రేమ కాస్త ఎక్కువే ఉంటుందని జగన్ చెప్పుకొచ్చారు. చంద్రబాబు వరద ప్రాంతాల పరిశీలనకు వెళ్లి ఎం మాట్లాడారో మనం చూశామన్నారు.
గాల్లో వచ్చారు.. గాల్లోనే పోతారని మాట్లాడారని.. ఆయన సంస్కారానికి ఓ నమస్కారమని అన్నారు. ముఖ్యమంత్రి వెళ్తే సహాయ కార్యక్రమాలకు ఆటంకం కలుగుతుందని జగన్ చెప్పడాన్ని ఎమ్మెల్యేలు అందరూ చప్పట్లు కొట్టి సమర్థించారు. ఇప్పటి వరకూ అన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఇలా పర్యటించి.. సహాయ కార్యక్రమాలకు ఆటంకాలు కలిస్తున్నారని.. సీఎం జగన్ తొలి సారి ట్రెండ్ సృష్టించారన్నట్లుగా ఎమ్మెల్యేల తీరు ఉందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.