విద్యార్థుల హాజరుకు అమ్మఒడిని అనుసంధానం చేసి .. స్కూళ్లు ప్రారంభమైనప్పుడే విద్యార్థులకు పథకాన్ని అందించాలని సీఎం అధికారులకు సూచించారు. సోమవారం విద్యా శాఖపై సమీక్ష జరిపిన సీఎం జగన్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. పిల్లలను బడికి రప్పించాలన్న స్పూర్తితోనే అమ్మఒడి ప్రారంభించామని.. విద్యార్థుల హాజరును పరిగణనలోకి తీసుకుని జూన్‌లో పిల్లల్ని స్కూల్‌కు పంపే సమయంలో, విద్యాసంవత్సరం ప్రారంభంలోనే అమ్మ ఒడిని అందించాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు.
అమ్మ ఒడి, విద్యాకానుక రెండూ కూడా పిల్లలు జూన్‌లో స్కూల్‌కి వచ్చేటప్పుడు ఇవ్వాలన్నారు. అకడమిక్ ఇయర్‌తో అమ్మ ఒడి అనుసంధానం కావాలని అధికారులకు స్పష్టం చేశారు. ఇప్పటి వరకూ జనవరిలో అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తున్నారు. జనవరి తొమ్మిదో తేదీన తల్లుల బ్యాంక్ అకౌంట్లలో నగదు జమ చేస్తున్నారు. సమీక్షలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలను బట్టి చూస్తే ఇక జూన్ నంచి అమలు చేసే అవకాశం ఉందని అంచనా వేయవచ్చు. అయితే దీనిపై ఇంకా స్పష్టత లేదు.
సీఎం జగన్ గతంలో ప్రకటించిన సంక్షేమ క్యాలెండర్ ప్రకారం జనవరిలో అమలు చేయాల్సి ఉంది. మరో వైపు ప్రతి స్కూల్‌కు నిర్వహణ ఖర్చుల కింద రూ. లక్ష కేటాయించాలని అధికారులను ఆదేశించారు. మరమ్మతులు ఇతర ఖర్చులు వస్తే వాటితో చేసుకుంటారన్నారు. దీనిపైనా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.