ఆరోగ్య శ్రీ పథకానికీ నూకలు చెల్లిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఆ పథకానికి కూడా ఆస్పత్రులతో సంబంధం లేకుండా పేషంట్లు.. లబ్దిదారులకే నగదు ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. నేరుగా లబ్ధిదారు ఖాతాలోకి డబ్బు, అక్కడ నుంచి ఆస్పత్రికి ఆటోడెబిట్లో చెల్లించేలా చూడాలని సీఎం జగన్ ఆదేశించారు. ఎవ్వరికీ అసౌకర్యం కలగకుండా ఈ ప్రక్రియ ఉండాలని ముందుగా పేషెంటు డిశ్చార్జి అయ్యే పేషెంటు, బ్యాంకు, ఆస్పత్రి మధ్య కన్సెంటుతో కూడిన ఫారం తీసుకుని పథకాన్ని అమలు చేయాలన్నారు. ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ఈ విధానంలో చాలావరకు పొరపాట్లను నివారించే అవకాశం ఉంటుందని కూడా చెప్పారు.
ఇప్పటికే ఫీజు రీఎంబర్స్ మెంట్ వంటి పథకాన్ని ఇలాగే కాలేజీలకు చెల్లించకండా నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో వేస్తున్నారు. నాలుగు విడతలుగా వేస్తామని చెప్పి.. రెండు విడతల వరకూ ఎగ్గొడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. దీని వల్ల కాలేజీలకు విద్యార్థుల తల్లిదండ్రులే కట్టుకోవాల్సి వస్తోంది. రైతులకు కరెంట్ మీటర్లు పెట్టి అదే పథకం అమలుచేస్తున్నారు. శ్రీకాకుళం రైతులు కూడా తమకు సమయానికి డబ్బులు ఖాతాల్లో జమ కావడం లేదని గగ్గోలు పెడుతున్నారు. ఈ సమయంలో ఆరోగ్యశ్రీ పథకానికీ అదే పద్దతి తీసుకు రావడంతో ఆ పథకమూ ఇక పేదలకూ దూరమయ్యే పరిస్థితి ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
ఆరోగ్యశ్రీ పథకంలో ఇప్పుడు ప్రైవేటు ఆస్పత్రుల్లో డబ్బు చెల్లించకుండా చికిత్స తీసుకోవచ్చు. బిల్లులు ప్రభుత్వం చెల్లిస్తుంది. అయితే ఎప్పుడు చెల్లిస్తే అప్పుడే తీసుకోవాలి. వందల కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయన్న ఆరోపణలు వస్తూంటాయి. బిల్లులు చెల్లించకపోతే వైద్యం ఆపేస్తామని చెబతూ ఉంటారు. అయితే ఈ ఇబ్బంది లేకుండా నేరుగా పేషంట్లకే ఇస్తే సమస్య ఉండదని ప్రభుత్వం భావిస్తోంది. పేషంట్లకు ఇస్తాం కాబట్టి ఆస్పత్రితో సంబంధం ఉండదు.. ఆస్పత్రికి బకాయిలనే ప్రశ్నే రాదని భావిస్తున్నారు. అయితే పేదలకు ఇస్తారా … ఇతర నగదు బదిలీ సబ్సిడీల్లాగే చేస్తారా అన్నది వేచి చూడాలి .అలా చేయడానికే కదా ఇలా నగదు బదిలీ అనేది ఎక్కువ మంది చెప్పే మాట.