ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్స్యకార భరోసా పథకానికి మీటనొక్కి నిధులు విడుదల చేయనున్నారు. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినా పాత జిల్లాల ప్రకారమే లెక్కలు చెబుతూ.. మొత్తంగా ఓ లక్ష మందికి నగదు బదిలీ చేస్తున్నారు. అంటే సగటున నియోజకవర్గానికి ఐదారు వందల మంది ఉంటారు. ఇందు కోసం సీఎం టూర్ ఏర్పాటు చేశారు. ఆయనకు కాన్వాయ్ ఖర్చుల దగ్గర్నుంచి బహిరంగసభల వరకూ చాలా ఖర్చు పెట్టుకుంటున్నారు. సీఎం ఓ సారి జనంలోకి వెళ్తే అన్ని రకాల ఖర్చులు కలుపుకుని.. రూ. ఇరవై కోట్ల వరకూ అవుతాయని భావిస్తున్నారు.
పైగా ఇటీవల జగన్ ఎక్కడకు వెళ్లినా ప్రత్యేకంగా రహదారుల చుట్టూ బారీకేడ్లు పెట్టి… పరదాలు కట్టేస్తున్నారు. ఇలాంటి ఏర్పాట్లతో పాటు రాను..పోను హెలికాఫ్టర్లతో సహా చాలా ఖర్చులు ఉంటాయి. అలాగే ఆయన ఈ పథకానికి నిధుల మీట నొక్కుతున్నారని మీడియాలో ఫుల్ పేజీ ప్రకటనలు ఇస్తున్నారు. అన్నిప్రధాన పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు. డిజిటల్ మీడియాలోనూ విస్తృతంగా చేస్తున్నారు. ఇలాంటివన్నీ కలుపుకుంటే… అసలు ఇచ్చే దాని కన్నా ఆ పేరుతో చేసుకునే ప్రచారానికే ఎక్కువ ఖర్చు పెడుతున్నట్లుగా కనిపిస్తోంది. నిజానికి ఈ సారి మత్య్సకార భరోసా లబ్దిదారులపై అదనపు ఆంక్షలు పెట్టి సగం మందికి పథకం వర్తించదని చెప్పేశారు.
ఇంట్లో చేపల వేటకు వెళ్లేవారు ఎంత మంది ఉన్నా… ఒక్కరికే ఇస్తామని చెప్పారు. ఇతర పథకాలు వర్తించే వారి పేర్లను జాబితా నుంచి తొలగించారు. ఇలాంటి విన్యాసాలు చేసిమిగిలిస్తున్న డబ్బును ఇలా ప్రచారానికి.. పర్యటన ఖర్చులకు వాడుతున్నారు. అసలు మంచి చేయడం కన్నా.. మంచి చేసినట్లుగా ప్రచారం చేసుకోవడం మంచిదని ప్రభుత్వం ఫీలవుతున్నట్లుగా కనిపిస్తోంది.