వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఆరుగురు ఎమ్మెల్సీ అభ్యర్థులను సీఎం జగన్ ఖరారు చేశారు. ఇటీవల మరణించిన వైసీపీ ప్రజాప్రతినిధులు చల్లా రామకృష్ణారెడ్డి, బల్లి దుర్గాప్రసాదరావు కుమారులకు ఎమ్మెల్సీలుగా చాన్సిచ్చారు. చల్లా రామకృష్ణారెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయనపదవిని ఆయన కుమారుడు భగీరథరెడ్డికి ఇచ్చారు. బల్లి దుర్గా ప్రసాదరావు తిరుపతి ఎంపీగా ఉన్నారు. ఆయన చనిపోయారు. అయితే ఎంపీ సీటును జగన్ ఫిజియోధెరపిస్ట్గా పని చేసిన వ్యక్తికి ఇవ్వాలని నిర్ణయించడంతో… దుర్గా ప్రసాదరావు కుమారుడు కల్యాణ్ చక్రవర్తికి ఎమ్మెల్సీ ఇచ్చారు.
ఇక శ్రీకాకుళం నేత దువ్వాడ శ్రీనివాస్, కడప జిల్లా నేత సి. రామచంద్రయ్య, విజయవాడకు చెందిన మైనార్టీ నేత కరీమున్నీసా, మహ్మద్ ఇక్బాల్‌లకు మిగిలిన స్థానాలు కేటాయించారు. ఇందులో మహ్మద్ ఇక్బాల్ సిట్టింగ్ ఎమ్మెల్సీ. ఆయన హిందూపురం ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. దువ్వాడ శ్రీనివాస్ కూడా.. టెక్కలిలో అచ్చెన్నాయుడుపై పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో ఆయన దూకుడైన ప్రవర్తనతో వివాదాస్పదమయ్యారు. ఆయన తన రాజకీయంతో హైకమాండ్‌ను ఆకట్టుకున్నారు. సి. రామచంద్రయ్య రకరకాల పార్టీలు మారి.. గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. పదవి కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడాయనకు అవకాశం ఇచ్చారు.
ఆరు ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి ఎన్నికల నామినేషన్ల దరఖాస్తుకు నాలుగో తేదీ ఆఖరు. మార్చి 15న పోలింగ్ జరుగుతుంది. ఇవన్నీ.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలే. ఒక్కో ఎమ్మెల్సీ గెలవడానికి 30 మంది వరకూ ఎమ్మెల్యేలు కావాలి. విపక్షాలకు అంతటి బలం లేకపోవడంతో ఆరుగురు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఖాయం. గత ఎన్నికలకు ముందు టిక్కెట్లు ఇవ్వలేకపోయిన వారికి.. పార్టీలో చేరిన వారికి పెద్ద ఎత్తున ఎమ్మెల్సీ హామీలు ఇచ్చారు. అయితే కొత్తగా వస్తున్న పదవులన్నీ… ఇలా చనిపోయిన నేతల వారసులకు.. ఓడిపోయిన నేతలకు ఇస్తూండటంతో చాలా మంది నిరాశకు గురవుతున్నారు. కానీ అడిగే ధైర్యం ఎవరూ చేయలేకపోతున్నారు.