హిందూపురంలో బాలకృష్ణపై నిలబెట్టడానికి సీఎం జగన్ దీపిక అనే కొత్త నేతను ఎంపిక చేసుకున్నారు. ఎమ్మెల్యేలు, ఇంచార్జుతో గడప గడపకూ సమీక్షకు.. ప్రస్తుతం ఇంచార్జ్ గా ఉన్న ఇక్బాల్‌కు సమాచారం అందలేదు. దీపిక అనే నాయకురాలిని ఆహ్వానించారు. దీంతో హిందూపురం వైసీపీలో ఒక్క సారిగా ఆశ్చర్యం వ్యక్తమయింది. ఎందుకంటే హిందూపురం వైసీపీలో చాలా గ్రూపులున్నాయి కానీ.. ఆ గ్రూపుల్లో ఎప్పుడూ వినిపించని పేరు దీపిక.
గత ఎన్నికల్లో హిందూపురం నుంచి మాజీ పోలీసు అధికారి ఇక్బాల్ పోటీ చేశారు. తర్వాత ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చారు. దాంతో ఆయనే హిందూపురంలో పెత్తనం చేస్తున్నారు. అయితే ఆయనను బలంగా వ్యతిరేకించే వర్గం అక్కడ ఉంది. ఆగ్రోస్ చైర్మన్ నవీన్ నిశ్చల్ వర్గంతో పాటు మరో రెండు వర్గాలు ఆయనకు వ్యతిరేకంగా ఉన్నాయి.ఈ క్రమంలో ఓ వర్గానికి చెందిన చౌళూరు రామకృష్ణారెడ్డి అనే నేత హత్యకు గురయ్యారు. ఈ హత్యలో ఇక్బాల్ పేరే ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. అయితే చర్యలు తీసుకోలేదు కానీ..ఆయనను పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
అయితే ఎవరిని ఇంచార్జ్ గా చేసిన అసమ్మతి ఉంటుందని..అందుకే ఎవరి గ్రూపు లేని దీపికను ఎంపిక చేశారని అంటున్నారు. ఈమెకు జిల్లా ఇంచార్జ్ గా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీస్సులు ఉన్నాయని చెబుతున్నారు. మొత్తంగా.. బాలకృష్ణకు మరోసారి కొత్త ప్రత్యర్థి హిందూపురంలో వచ్చే అవకాశం కనిపిస్తోంది.