ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని విపక్షాలు మత పరంగా ఎన్ని విమర్శలు చేస్తున్నప్పటికీ.. తన పని తాను చేసుకుపోతున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సారి సంక్రాంతికి గోపూజలో పాల్గొంటున్నారు. నరసరావుపేట మున్సిపల్ స్టేడియంలో జరిగే గోపూజ మహోత్సవంలో ముఖ్యమంత్రి పాల్గొనాలని నిర్ణయించారు. టీటీడీ, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా గోపూజ కార్యక్రమం జరుగుతోంది. మొత్తం 2,679 ఆలయాల్లో గోపూజ జరుగుతోంది. అందులో భాగంగా నర్సరావుపేటలో భారీగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమంలో సీఎం పాల్గొని గోవులకు పూజ చేయనున్నారు.
కనుమ పండుగను పశువుల పండుగగా భావిస్తారు. తమ యజమానులకు సహాయకంగా ఉండే ముగజీవాలని ఆరాధించే రోజు కనుమ పండుగ. సంప్రదాయంగా ఇంట్లోని పశువుల్ని ఈ పండుగ సందర్భంగా పూజిస్తారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కూడా.. పశువులను పూజించే కార్యక్రమాంలో పాల్గొనాలని భావించారు. వెంటనే.. సీఎంవో అధికారులు నర్సరావుపేటలో కార్యక్రమాన్ని ఖరారు చేశారు. హిందూ సంప్రదాయం ప్రకారం.. ముఖ్యమంత్రి జగన్.. పశువుల్ని పూజించనున్నారు.
ఇటీవలి కాలంలో ఏపీలో జరుగుతున్న రాజకీయ మార్పుల కారణంగా… మత ప్రస్తావన ఎక్కువగా వస్తోంది. దీనికి చెక్ పెట్టేందుకు జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా హిందూ ధార్మిక కార్యకలాపాల్లో పాల్గొంటూ… అన్ని మతాలూ తనకు సమానమేనని చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. గత ప్రభుత్వం అభివృద్ధి కార్యకలాపాల పేరుతో కూల్చివేసిన గుళ్లు నిర్మిస్తామని.. ప్రకటించడమే కాకుండా.., సంప్రదాయబద్ధంగా శంకుస్థాపన కూడా చేశారు. ఇప్పుడు గోపూజలో పాల్గొంటున్నారు.