ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ పెట్టుబడుల కోసం ప్రయత్నాలు చేయడం లేదని విపక్షాలు చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చేందుకు ప్రభుత్వం రెడీ అయింది. ప్రతి ఏడాది జనవరిలో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు సీఎం జగన్‌కు ఆహ్వానం అందింది. ఈ మేరకు వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ప్రతినిధి ఢిల్లీలో మంత్రి గౌతం రెడ్డిని కలిశారు. 2022లో జనవరి 17-21 మధ్య దావోస్‌లో నిర్వహించే సదస్సులో సీఎం జగన్ పాల్గొనాలని కోరారు. ఈ ఆహ్వానాన్ని సీఎం జగన్ మన్నించారో లేదో స్పష్టత లేదు. ఆహ్వానం అందిన విషయాన్ని మాత్రం పరిశ్రమల మంత్రి గౌతం రెడ్డి పేషీ నుంచి మీడియాకు సమాచారం వచ్చింది.
సీఎంగా చంద్రబాబు ఉన్నప్పుడు ప్రతి ఏడాది దావోస్‌కు వెళ్లి ఆంధ్రప్రదేశ్‌ను ప్రమోట్ చేసే ప్రయత్నాలు చేసేవారు. ప్రత్యేకంగా స్టాల్ పెట్టేవారు. అయితే సీఎంగా జగన్ వచ్చిన తర్వాత ఏపీ ప్రతినిధి బృందం దావోస్ కు వెళ్లడం లేదు. అక్కడ్నుంచి ఆహ్వానాలు కూడా అందడం లేదు. వచ్చే ఏడాది జరగనున్న దావోస్ సమావేశానికి కూడా ఇప్పటికే అందరికీ ఆహ్వానాలు పంపారు. రెండు నెలల కిందటే తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం అందింది. కరోనా పరిస్థితుల నుంచి తెలంగాణ వేగంగా బయటపడటానికి ఆయన చేస్తున్న కృషిని గుర్తించి ఆహ్వానిస్తున్నట్లుగా ప్రపంచ ఆర్థిక వేదిక తెలిపింది.
ఏపీ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ప్రపంచ పెట్టుబడిదారుల్లో ఏపీపై అపనమ్మకం ఏర్పడింది. మొదటి ఏడాది విద్యుత్ రంగంలో పీపీఏల రద్దు వివాదం ఉండటంతో ఏపీ గురించి దావోస్‌లో నెగెటివ్ ప్రచారం జరిగింది. ఏపీ గురించి పారిశ్రామికవేత్తలు వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున పెట్టుబడుల ప్రయత్నాలు చేస్తున్నందు వల్ల సీఎంజగన్ దావోస్ వెళ్తారని భావిస్తున్నారు.