గత ఏడాది సెప్టెంబర్‌లో ముగ్గురు మంత్రులకు ఉద్వాసన చెప్పబోతున్నట్లుగా వైఎస్ఆర్సీపీ వర్గాలు మీడియాకు స్పష్టమైన లీక్‌లు ఇచ్చాయి. కేబినెట్ సమావేశంలో జగన్ తన కుటుంబంపై టీడీపీ ఆరోపణలు చేస్తున్నా పట్టించుకోవడం లేదని .. ఇలా అయితే ఇద్దరు, ముగ్గురు మంత్రుల్ని మార్చేస్తానని హెచ్చరించారు. ఆ మాటలు అన్న తర్వాతి రోజే ముగ్గురు మంత్రులకు ఉద్వాసన ఖాయమని లీకులు ఇచ్చారు. ముగ్గురు మంత్రులు అంటూ.. ఐదారుగురు పేర్లు బయటకు వచ్చాయి. జోరుగా ప్రచారం జరిగింది కానీ.. తర్వాత మార్చలేదు.
నవంబర్, డిసెంబర్, సంక్రాంతి అంటూ ప్రచారం చేశారు. తర్వాత మర్చిపోయారు. ప్రస్తుత మంత్రివర్గం అయితే కళంకితులు.. లేకపోతే అసమర్థులు అన్నట్లుగా చీలిపోయింది. ఈ కేబినెట్ తోనే జగన్ ఎన్నికలకు వెళ్తారా అని అప్పట్లోనే వైసీపీ క్యాడర్ కూడా ఆశ్చర్యపోయింది. కొంత మందిని తీసేసి.. సామాజికవర్గాల సమీకరణాల ప్రకారమూ మరికొంత మందికి చాన్సిస్తామని చెప్పుకున్నారు. కేబినెట్లోకి ఎవరెవరు అనే చర్చ కూడా పెట్టారు. కానీ ఇప్పుడు మాత్రం సైలెంట్ అయిపోయారు.
పగ్గాలు చేపట్టిన మూడేళ్ల తర్వాత కేబినెట్ మంత్రులందరితో రాజీనామాలు తీసుకుని కొత్త కేబినెట్ ఏర్పాటు చేశారు. అయితే అందులో పదకొండు మంది పాతవారికే అవకాశం కల్పించారు. అవకాశం లభించని వాళ్లని పేర్ని నాని, కొడాలి నాని లాంటి నోరున్న నేతలున్నారు. వారి ప్లేస్‌లో వమంత్రి పదవులు చేపట్టిన వారు సైలెంట్‌గా ఉంటున్నారు. పదవులు పీకేసినా వారే నోటికి పని చెప్పాల్సి వస్తోంది. మంత్రుల్లో గట్టి వాయిస్ ఉన్న వారు లేరు. అయితే ఇప్పుడు మంత్రివర్గాన్ని కదిలిస్తే లేనిపోని తలనొప్పులు తెచ్చుకున్నట్లేనని సీఎం జగన్ అనుకుంటున్నారు. అందుకే మంత్రివర్గ మార్పు అనే మాటే తన నోటి వెంట రానివ్వడం లేదు.