ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి ఫుల్ పేజీ ప్రకటనలు జారీ చేసింది. ప్రతిచిన్న పథకానికి ఫుల్ పేజీ ప్రకటనలు ఇస్తూ ఉంటారు. అలాగే శంకుస్థాపనలకూ ఇస్తున్నారు. ఇప్పుడు కొత్తగా మళ్లీ మళ్లీ చేసే శంకుస్థాపనలకు కూడా పెద్ద ఎత్తున ప్రకటనలు ఇస్తున్నారు. ఆరు నెలల క్రితం పేదలకు ఇచ్చిన సెంటు స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలను సీఎం జగన్ ప్రారంభించారు. వీటికి గుర్తుగా మూడు చోట్ల పైలాన్లు కూడా నిర్మించారు. అనూహ్యంగా మళ్లీ ఆరు నెలల తర్వాత ఈ రోజున ఇళ్ల నిర్మాణాలను మళ్లీ ప్రారంభిస్తున్నారు సీఎం జగన్. ఇందు కోసం మళ్లీ ఫుల్ పేజీ ప్రకటనలు జారీ చేశారు. ఏపీ సర్కార్ తీరుపై అందరిలోనూ ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.
పేదలకు ఇంటి స్థలం మాత్రమే కాదు.. అందులో నిర్దేశిత నమూనాలో ఇల్లు కట్టిస్తామంటూ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇళ్ల స్థలాలు ఎక్కడెక్కడో ఉండటంతో వాటిలో మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన పరిస్థితి. ఆ మౌలిక సదుపాయాల కల్పన పరిస్థితి కూడా ఇంత వరకూ పుంజుకోలేదు. కానీ కొన్ని చోట్ల ఇళ్లు కట్టడం ప్రారంభించారు. ఇళ్ల నిర్మాణం ప్రభుత్వానికి భారంగా మారే పరిస్థితి ఉండటంతో… ఎలాగోలా లబ్దిదారులకే ఇళ్ల నిర్మాణ బాధ్యతలు అప్పగించాలనుకున్నారు. మూడు ఆప్షన్లు ఇచ్చారు. అందులో రెండు .. లబ్దిదారులే కట్టుకోవాలి..మూడోది ప్రభుత్వమే కట్టివ్వాలి. ఎక్కువ మంది మూడో దానికే ఆప్షన్ ఇచ్చారు. దాంతో ప్రభుత్వానికి ఏం చేయాలో అర్ధం కాలేదేమో కానీ…మళ్లీ ఇప్పుడు.. కొత్తగా ఆప్షన్లను ప్రకటనల్లో ఇచ్చింది. ఆ ఆప్షన్లలో ఉన్న మ్యాటర్ ఇప్పుడు మారిపోయింది.
ప్రభుత్వం ఇళ్లు కట్టిస్తుందన్న ఆప్షన్ .. ప్రస్తుతం లేదు. కావాల్సిన నిర్మాణ సామాగ్రి అంతా సమకూర్చి పెట్టి.. కట్టిస్తాం అన్నట్లుగా చెబుతున్నారు. అంటే. . సామాగ్రి ఇస్తే లబ్దిదారులే ఇళ్లు కట్టుకోవాలన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఇళ్ల నిర్మాణం విషయంలో ప్రభుత్వం తీరు.. సందేహాస్పదంగా మారడం.. లబ్దిదారులను సైతం అయోమయానికిగురి చేస్తోంది. గతంలో ఒకే కాంట్రాక్టర్కు అప్పగించాలని… పనులు వేగంగా జరిగేలా చూడాలని సీఎం ఆదేశించేవారు. కానీ ఇప్పటి వరకూ కాంట్రాక్టర్లను ఎంపిక చేశారో లేదో కూడా స్పష్టత లేదు. ఇప్పుడు రెండో సారి శంకుస్థాపనలు చేస్తున్నారు.
ఇళ్ల నిర్మాణం ఒక ఎత్తు అయితే… ఆ ఇళ్ల స్థలాల వద్ద సీఎం జగన్ చెప్పినట్లుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ.. అండర్ గ్రౌండ్ కేబుల్ వ్యవస్థ .. సిమెంట్ రోడ్లు సహా అనేక సౌకర్యాలు కల్పించడం ఓ సవాల్. వీటిని పూర్తిచేయకపోతే.. ఆ నివాస స్థలాలు ఎందుకూ ఉపయోగపడవు. ప్రభుత్వం ఈ విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే.. లబ్దిదారులు వ్యతిరేకమయ్యే ప్రమాదం ఉంది.