కర్నూలులో గ్రీన్కో సంప్రదాయేతర ఇంధన విద్యుత్ ప్లాంట్ పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జగన్క గ్రీన్ కో సంస్థకు అభినందనలు తెలిపారు. కానీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ సంస్థను జగన్ ఎలా వెంటాడారో ఇండస్ట్రీ వర్గాలకు తెలుసు. సాక్షాత్తూ అసెంబ్లీలో చార్ట్ ప్రదర్శించి గ్రీన్ కో సంస్థతో గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలపై విమర్శలు చేశారు. గ్రీన్ కో లోకేష్ బినామీ అని వైసీపీ నేతలు ఆరోపించారు. ఒక్క సంస్థ వల్ల రూ. ఇరవై వేల కోట్ల నష్టం ఏపీ ప్రజలకు వస్తుందన్నారు.
ప్రభుత్వం ఏర్పడగానే పీపీఏ రద్దు నోటీసులు అందుకున్న కంపెనీల్లో గ్రీన్కో అనే కంపెనీ కూడా ఉంది. ఈ కంపెనీకి చెందిన మూడు విద్యుత్ యూనిట్లతో.. ఏపీ సర్కార్ … విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంది. గ్రీన్ కో కంపెనీ తమకిచ్చిన నోటీసులపై ట్రిబ్యూనల్‌లో పిటిషన్ వేసింది. ఏపీ ప్రభుత్వం నోటీసులు ఇవ్వడాన్ని ట్రిబ్యునల్ తప్పు పట్టింది. స్టే విధించింది. ఇప్పుడు అదే గ్రీన్ కో కంపెనీ.. గత ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం మేరకు ప్లాంట్ పెడుతోంది. మూడేళ్ల పాటు ఆ కంపెనీని నానా తిప్పలు పెట్టి.. ఇప్పుడు స్వయంగా జగన్ వెళ్లి శంకుస్థాపన చేశారు.
పీపీఏ విషయంలో.. ఎలాంటి దూకుడైన నిర్ణయాలు తీసుకోవద్దని.. అది పెట్టుబడిదారులపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెబుతూ.. కేంద్రం పలుమార్లు లేఖలు రాసింది. అగ్రిమెంట్ల రద్దు వంటి నిర్ణయాలు తీసుకుంటే… న్యాయపరమైన సమస్యలు వస్తాయని హెచ్చరించింది. అలాగే.. ధరలు నిర్ణయం అయ్యే ప్రాసెస్, ఇతర రాష్ట్రాల్లో.. పీపీఏల ధరలు.. ఇలా అన్నింటి వివరణతో.. కేంద్రానికి లేఖలు పంపింది. అయినప్పటికీ.. ముఖ్యమంత్రి వేధింపులు కొనసాగించారు. చివరికి ఆయనే ఆ ప్లాంట్‌కు శంకుస్థాపన చేయాల్సి వచ్చింది.