పదిహేనో తేదీన రైతు భరోసా పథకం ప్రారంభోత్సవానికి రావాలని ప్రధాని మోదీని ..ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆహ్వానించారు. మోడీ అపాయింట్మెంట్ ఇవ్వడంతో.. మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లిన జగన్… ముప్పావు గంట పాటు ప్రధానితో సమావేశం అయ్యారు. పలు అంశాలపై విజ్ఞాపన పత్రం ఇచ్చి… వెంటనే… నేరుగా… విజయవాడ వెళ్లిపోయారు. ప్రధానంగా రైతుభరోసా పథకం ప్రారంభోత్సవానికి ఈ నెల 15న రాష్ట్రానికి రావాల్సిందిగా ఆహ్వానించారు.
ఈ పథకం కింద రైతులకు పెట్టుబడి సాయంగా ఒక్కో రైతు కుటుంబానికి రూ. 12,500 రూపాయలు ఇవ్వనుంది. అయితే ఇందులో..రూ. 6,000 కేంద్ర ప్రభుత్వ కిసాన్ యోజన పథకం నిధులు. తన వాటాగా రూ. 6,500లను రాష్ట్ర ప్రభుత్వం 50 లక్షలకు పైగా రైతు కుటుంబాలతో పాటు మరో రెండు లక్షల మంది కౌలు రైతులకు లబ్ది.. రైతుల ఖాతాలలో రూ.5,500 కోట్లను జమ చేయనుంది. దీన్ని ప్రధాని చేతుల మీదుగా చేయాలని జగన్ సంకల్పించారు. అయితే.. మోడీ.. ఏపీకి వస్తారా లేదా.. అన్న దానిపై.. స్పష్టమైన సూచనలు ముఖ్యమంత్రికి అందలేదు.
అలాగే పోలవరం ప్రాజెక్టు పనులకు రివర్స్ టెండర్ ద్వారా ఆదా అయిన నిధుల వివరాలను మోడీకి జగన్ వివరించారు. ఈ అంశంపై మోడీ స్పందనేమిటో ఇంకా తెలియలేదు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు త్వరితగతిన విడుదల చేయాలని కోరారు. ప్రస్తుతం రాష్ట్రం భారీగా రెవెన్యూ లోటుతో ఉన్నందున ఆ లోటు భర్తీకి అవసరమైన నిధులు కేటాయించాలని కూడా ప్రధానిని జగన్ కోరారు. ప్రతిపాదిత విశాఖ–కాకినాడ పెట్రో అండ్ పెట్రో కెమికల్ కారిడార్ ఏర్పాటునకు కేంద్రం సహకారం అందించాలని.. రాజధాని నిర్మాణానికి అవసరమైన ఆర్థిక సాయం అందించాలని కూడా జగన్ కోరారు. వెనుకబడిన జిల్లాల నిధులు, గోదావరి జలాలను సాగర్ – శ్రీశైలంలకు తరలించే ప్రాజెక్ట్‌కు ఆర్థిక సాయం కూడా.. జగన్ ఇచ్చిన విజ్ఞాపన జాబితాలో ఉన్నాయి.
అయితే అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజధానికి కూడా సాయం కావాలని జగన్ కోరడం.. సంచలనం అయింది. గత పర్యటనలో అమరావతికి ఇప్పుడేమీ నిధులు ఇవ్వవొద్దని కోరినట్లుగా ప్రచారం జరిగింది. ఇప్పుడు దానికి విరుద్ధంగా… రాజధాని అభివృద్ధికి నిధులు కోరినట్లు జగన్ మీడియానే ప్రచారం చేస్తోంది. ఈ మార్పు ఎందుకన్నది.. రాజకీయవర్గాలకు అంతుబట్టడం లేదు. ప్రత్యేకంగా మోడీతో సమావేశానికే ఢిల్లీ వెళ్లిన జగన్మోహన్ రెడ్డి… ప్రధానమంత్రి ఇంటి నుంచి నేరుగా ఢిల్లీ ఎయిర్ పోర్టుకు వెళ్లారు. అక్కడ్నుంచి విజయవాడ చేరుకున్నారు. మామూలుగా అయితే కొంత మంది కేంద్రమంత్రులతో మాట్లాడి… రాష్ట్ర వ్యవహారాలపై చర్చించేవారు. ఈ సారి అలాంటివేమీ పెట్టుకోలేదు. మొత్తంగా ఒక్క పూట మాత్రమే జగన్ ఢిల్లీలో ఉన్నారు.